#


Back

ఉపనిషచ్చింతన

ఉపనిషత్తంటే దగ్గరగా కూచోటమని అర్ధం. పూర్వం శిష్యులు గురువులకు దగ్గరగా కూచొని అరణ్యాలలో ఏకాంతంగా జీవిత సమస్యలను గూర్చి చర్చించేవారు. శిష్యుల కంతేవాసులని కూడా అందుకే పేరు వచ్చింది. మరి అంత దగ్గరగా కూచొని ఏకాంతంగా గోష్ఠి జరిపారంటే అది ఏదో గొప్ప రహస్యమే అయి ఉండాలి. నిజంగా రహస్యమే అది. రహస్యాలన్నిటిలోకి రహస్యం. అది ఏదో గాదీ సృష్టి రహస్యమే. ఇది దృష్టిలో పెట్టుకొనే ఉపనిషత్తంటే రహస్య విజ్ఞానమని కూడా వ్యాఖ్యానించారు శంకర భగవత్పాదులు.

సృష్టి రహస్యమొకటి అర్ధమైతే అంతా అర్ధమయినట్టే మానవుడికి. అదే అంతుపట్టటం లేదు. అది భేదించడానికే మన ప్రాచీనులైన మహర్షులెంతగానో పరిశోధనలు చేశారు. అందరూ ఒకచోట సమావేశమై కిమ్ కారణం బ్రహ్మ కుతఃస్మ జాతాః మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళుతున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మనం సుఖం కోరితే దుఃఖమెందు కెదురవుదున్నదని ఇలా జీవిత సమస్యలను గూర్చి చర్చ సాగించారు. వాటికి సమాధాన మొకడు కాలమంటే, ఒకడు స్వభావమంటే, ఒకడు నియతి అంటే, ఒకడు యదృచ్ఛ అంటే, ఒకడిదంతా మన ప్రయత్నమేనంటే ఇలా ఎవరికి తోచినట్లు వారు చెబుతూ పోయారు.

అప్పుడు సభాధ్యక్షుడు లేచి ఇవి ఏవీ గావుకారణం. ఎందుకంటే కాలాదులచేతనాలు వాటికిది ఇలా చేయాలని సంకల్పం లేదు. పోతే మానవుడు చేతనుడైనా వాడి జ్ఞానం పరిమితం. ఇంత పెద్ద ప్రణాళిక వేయలేడు. కాబట్టి ఈ జీవ జగత్తులకు రెంటికి అతీతమైన శక్తి ఏదో ఉందది తెలుసుకోవాలని అందరూ కలసి మాటలు కట్టిపెట్టి ధ్యానంలో మునిగిపోయారు. పోగాపోగా వారికొక సత్యం భాసించింది. అది నిరాకారం నిశ్చలం సర్వవ్యాపకమైన చైతన్యం. అదే ఈకాల స్వభావాదులన్నిటినీ తనలో ఇముడ్చుకొని కనిపిస్తున్నది. ఎలా కనిపిస్తున్నదది. ఏతద్ జ్ఞేయం నిత్యమే వాత్మసంస్థమ్. తమకు విషయంగా కాక తమ స్వరూపంగానే కనిపిస్తున్నది. అంతే గాక విషయప్రపంచం కూడా దానికి భిన్నంగా కాక దాని రూపంగానే దర్శనమిచ్చింది. భోక్తా భోగ్యం ప్రేరితారం చమత్వా, సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమే తత్. భోక్త అంటే జీవుడు. భోగ్యమంటే జగత్తు. ప్రేరిత అంటే వీటికి విలక్షణమని భావించే ఈశ్వరుడు. ఈ మూడూ మూడుగా గాక ఒకే ఒక ఆత్మచైతన్యంగా భాసించిందట. ఆ చైతన్యమే ఇన్ని రూపాలుగా మారి భాసిస్తున్నదని తెలుసుకొన్నారట చివరకు.

ఇదీ శ్వేతాశ్వతరమనే ఉపనిషత్తు మనకు బోధించిన ఒకానొక రహస్యం. అదేగాదు. అన్ని ఉపనిషత్తులు కూడా చెప్పే రహస్యమిదే. మానవ విజ్ఞానాని కంతటికి భాండాగారం లాంటిది వేదమైతే అ వేదానికి పర్యవసాన ముపనిషత్తు. అది మానవుడి అనుభవాన్ని అంతా విశ్లేషించి దానికొక తిరుగు లేని పరిష్కారంచేసి చూపింది. మన అనుభవంలో ఉన్న అంశాలు మూడే. ఒకటి మనకు నిత్యమూ కనిపించే ఈ ప్రపంచం. రెండు దీనికతీతంగా కనిపించకుండా ఎక్కడో ఉందని భావించే ఈశ్వరుడు. మూడు ఈ రెండు కొసలతో సంబంధం పెట్టుకొని బ్రతికే మనం. జీవజగదీశ్వరులనే ఈ మూడింటికీ తత్త్వత్రయమని పేరు. ఏకాలంలో ఏ మేధావంతు డాలోచించినా ఈ మూడింటిని గురించే ఆలోచించవలసింది. ఇంతకు మించి నాలుగవదంటూ లేదు మనమాలోచించవలసిన పదార్ధం. ఇందులో ఆలోచించి పరిష్కరించుకోవలసిన వాడటు ఈశ్వరుడూ కాదు. ఇటు జగత్తు కాదు. జగత్తు కేవల జడ పదార్ధం. ఈశ్వరుడు పరిపూర్ణ చైతన్యం. కాబట్టి ఇరువురికీ లేదా అవసరం. పోతే అచేతనం కాక చేతనమైనా పరిపూర్ణంకాని మనబోటి జీవుడికే ఈ సమస్య. మనమే పరిష్కరించుకోవాలి. మనలోనే బాగా ఎత్తులకెదిగి చూడగలవాడెవడో వాడే ఋషి. వాడు దర్శించి మరలా మనకు శబ్దరూపంగా వెల్లడించిన అనుభవాలే ఉపనిషత్తులంటే.

ఏమిటి వారు దర్శించి చాటిన ఆ సత్యమంటే జగత్తు జీవుడు ఈశ్వరుడు అని మూడు కావు వాస్తవంలో. వాస్తవంలో ఉన్నదొకే ఒక తత్త్వం. అది సర్వవ్యాపకమైన పరిపూర్ణమైన చైతన్యం. చైతన్యం గనుక అది స్వతసిద్ధం. స్వతసిద్ధం గనుక ఆత్మస్వరూపం. మరి ఈ అనాత్మ ప్రపంచమేదోగాదు. దాని ఆభాసే. అంటే అదే ఈ రూపంలో ఇలా భాసిస్తున్నదని అర్ధం. ఒక సువర్ణమే ఆభరణాల రూపంలో భాసించటం లేదా. అలాగే ఈ ఆభాసనే చూచి వస్తువును మరచిపోయిన చైతన్య భాగమేదో అది జీవుడు. మరవకుండా చూస్తున్న చైతన్య మీశ్వరుడు. ఇవి మూడు కలసి ఆత్మచైతన్య విభూతేనను కొన్నవాడికిక ఏ సమస్య లేదు. వాడు ముక్తుడు. అలా అనుకోలేనంత వరకూ అన్ని సమస్యలు ఉన్నాయి. వాడు బద్ధుడు. అనుకోవటమే జ్ఞానం. అనుకోకపోవటమే అజ్ఞానం. ఆత్మజ్ఞానం మనకందించి అనాత్మ భావంనుంచి మనకు మోక్షం ప్రసాదించటానికే ఉపనిష ద్వాఙ్మయమంతా అవతరించిందసలు.

ఉపనిషత్తులనేవి ఒకటి గాదు. పదకొండు వందల ఎనిమిదున్నాయి ఉపనిషత్తులు. నాలుగు వేదాలకూ కలిపి అన్ని శాఖలున్నాయి. ప్రతి శాఖ అంతంలో ఒక ఉపనిషత్తు వస్తుంది. అంతంలో వస్తుంది కాబట్టి వేదాంతమని పేరు వచ్చిందుపనిషత్తుకు. అవి పదకొండు వందల ఎనిమిదయితే అందులో నూట ఎనిమిది చాలా ప్రశస్తం. శ్రీరాముడు హనుమంతుడి కానూటఎనిమిదీ బోధ చేసాడు. అందులోనూ పది ఉపనిషత్తులు సారభూతమైన వన్నారు. ఈశ కేన కఠ ప్రశ్నముండక మాండూక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్య మేవచ - అని వాటిని మన ప్రాచీనులు వర్ణించి చెప్పారు. ఈ అనాత్మ జగత్తంతా వట్టి ఆభాసే. వస్తువు కేవలమా ఈశ్వర చైతన్యమే. కాబట్టి ఆ ఈశ్వర భావనతో దీన్ని దర్శించండి. తన్మయంగానే కనిపిస్తుంది. తేన త్యక్తేన భుంజీథా - నామరూపాత్మకంగా వదిలేసి సచ్చిద్రూపంగా పట్టుకోవటమే మనం చేయవలసిన సాధన. సర్వము ఆత్మగా దర్శించి నపుడు కోమోహః కశ్శోకః - ఏకత్వమను పశ్యతః - అసలు ఏకత్వ భావనలో ఇక శోక మేముంది. మోహ మేముందని ఈశావాస్యం చాటుతుంది. ఎక్కడున్నాడా ఈశ్వరుడంటే ప్రాణస్య ప్రాణమ్ - మనసో మనొయత్ - మన ప్రాణ చలనమూ మనశ్చలనమూ - ఈ చలనాలు ఏ అచలం నుంచి ఏర్పడుతున్నవో ఆ అచలమైన చైతన్య మొకటి ఉండాలి గదా. అది వ్యక్తమూ గాదు. అవ్యక్తమూ గాదు. రెంటికి విలక్షణం. ప్రతిబోధ విదితం - దానిని ప్రతి ఆలోచనకూ ఆధార పీఠమనే భావనతో పట్టుకోవాలని కేనోపనిషత్తు సలహా. అందుకోసం ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్ని బోధత - లేచి వెళ్ళి పెద్దల నాశ్రయించండి. అనన్య ప్రోక్తేగతి రత్ర నాస్తి. ఆత్మ తత్త్వాన్ని దర్శించిన వారు కాబట్టి వారు నీకు ఆ అనుభవం ప్రసాదించగలరని చెబుతుంది కఠోపనిషత్తు. అది ఎలా ప్రసాదిస్తారు ఆ అనుభవమని అడిగితే్ నామాది ప్రాణాంతంగా షోడశ కలాత్మకమైన ఈ సృష్టి అంతా నిష్కలమైన ఆ పురుష తత్త్వం నుంచే వచ్చింది. కాబట్టి యధా నద్య స్స్యందమానా స్సముద్రే - తథా కలాః పురుషం ప్రాప్యాస్తం గచ్ఛంతి. గంగా యమునాది నదులన్నీ సముద్రంలో కలసి నామరూపాలు ఎలా వదిలేస్తాయో అలాగే ఇవన్నీ పురుష చైతన్యంలోనే లీనమై అది ఆత్మగానే మనకు ఏకంగా సాక్షాత్కరిస్తుంది. ఈ ప్రవిలాపనమే సాధన అని బోధిస్తుంది ప్రశ్నోపనిషత్తు. ఆ ఏకాత్మా నుభవమెలా ఉంటుందని అడిగితే బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ పురస్తాత్ - బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్ఠం - నీవూ నీవు చూచే ఈ ప్రపంచమూ అంతా బ్రహ్మ స్వరూపమే అదిపరిపూర్ణమైన నీ చైతన్యమే. ఎక్కడ చూచినా ఏది చూచినా నీకు నీవే దర్శనమిస్తుంటావని చాటుతున్నది ముండకోపనిషత్తు. అప్పుడిక జాగ్రత్స్వప్నసుషుప్తులని మూడవస్ధలు గాక అంతా కలిసి ఒకేఒక తురీయావస్ధ గానే మారి గోచరిస్తుంది. ద్రష్టా దృశ్యమనే భేదం కూడా నశిస్తుందని మాండూక్యం చెప్పేమాట. అయితే అదే ఆఖరు మాట లయినా దేహాత్మాభిమాన మున్నంత వరకూ ఒక్కసారిగా అది అనుభవానికి రావటం కష్టసాధ్యం. కనుక అన్న మయాది పంచ కోశాలను ఒక్కొక్క పొరలాగా విప్పుకొంటూ పోయి ఆనందమయ కోశంకూడా దాటి చివరకు కోశాలన్నీ నాకు వేరుగావు - నా స్వరూపమేనని ఉపాధులను కూడా చైతన్యంలో కలుపుకొని చూస్తే సమకూరుతుం దంటుంది తైత్తిరీయోపనిషత్తు. ఆత్మనెప్పుడు గాని వ్యష్టిగా కాక సమష్టిగా చూడటం నేర్చుకోవాలి. దృషిని సమష్టి మీదకి మళ్ళించటానికే ఈ జీవజగద్రూపమైన సృష్టినంతా ఒక సంకేతంగా వర్ణించింది శాస్త్రమని శాస్త్రరహస్యం విప్పి చెబుతుంది ఐతరేయం. అది గ్రహిస్తే అప్పుడు త్వం పదార్ధమైన నీవు లేవు. సమష్టి రూపమైన తత్పదార్ధమే నీవని తత్త్వమసి సూత్రం బయట పెడుతుంది ఛాందోగ్యం. పోతే అది గట్టి చేసుకొంటే చాలు నీవిక చేయవలసిన అభ్యాసం బాహ్యంగా ఏదీలేదని ఉపదేశిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతం ద్వారా ఆఖరిదైన బృహదారణ్యకం.

ఇంతకూ ఏ ఉపనిషత్తు ఎలా బోధించినా సారాంశమొకటే. అది ఈ అనేకత్వంలో నుంచి మన బుద్దినేకత్వం వైపు మళ్ళించటమే. అనేకమనేది నిజానికి ఏకత్వం నుంచి వచ్చిందే. ఆ ఏకత్వం ఎక్కడో లేదు. ఈ అనేకత్వంలోనే ఉంది మరలా. కాని అది మనకీ అనేకత్వం మీదనే దృష్టి ఉన్నంతవరకూ కనపడదు. ఆభరణాలలో బంగారం లాగా మరుగునపడి ఉంటుంది. దాని మూలంగా జీవుడూ, జగత్తూ, ఈశ్వరుడూ వేరయిపోయి అన్ని సమస్యలకూ అది దారితీస్తున్నది. ఇదీ సంసార బంధం. ఇది పరిష్కారం కావాలంటే మరలా అనేకత్వంలో దాగి ఉన్న ఆ ఏకైకమైన ఆత్మతత్త్వం మీద చూపు నిలిపి ఆ చూపుతో ఈ అనాత్మ ప్రపంచాన్ని దర్శించాలి. దర్శిస్తే అప్పుడీ నామరూపాత్మకమైన జగత్తంతా చైతన్యంలో కలిసి సృష్టి అంతా మన స్వరూపంగానే అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఆ అనుభవంలో ఇక జీవజగదీశ్వరులనే భేదమూ లేదు. తన్నిమిత్తమైన సమస్యా లేదు. మానవుడి విజ్ఞానానికి అనుభవానికి . రెంటికీ పరిపూర్ణత అది.

***