దీన్నిబట్టి మన మిక్కడ పురుష సూక్తంలో ఈ ఘట్టం కూడా వాటి కనుగుణంగానే అన్వయించి చెప్పుకోటమే సరియైన మార్గం. అలా అన్వయిస్తే అందులో నుంచి ఇది అనిగాక అదే ఇది అని సామానాధి కరణ్యం Identity చెప్పవలసి ఉంటుంది. ఎలా గంటే చంద్రుడాయన మనసు నుంచి వచ్చాడని గాక విరాట్పురుషుడి మనస్సే చంద్రుడని - నేత్రమే సూర్యుడని ఇలా వ్యాఖ్యానిస్తూ పోవటమే. ఇది కార్య కారణాలకు తాదాత్మ్య సంబంధం చెప్పే అద్వైత సంప్రదాయానికి సరిపడుతుంది కూడా. సరే బాగానే ఉన్నది. తాదాత్మ్యం చెప్పినా ఇంతకూ ఈ మంత్రాని కేమని చెప్పాలర్ధం. ఎలా చెప్పాలని ప్రశ్న.
చంద్రుడే మనస్సంటే మనస్సనేది సంకల్ప వికల్పాత్మకం. సంకల్ప రూపంగా ఒక ప్రణాళిక వేసుకొని వికల్ప రూపంగా దాన్ని అమలుపరిచి ఈ చరా చర ప్రపంచంగా పరిణమించాడా ప్రజాపతి. సృష్టి కర్తే సృష్టి అయ్యాడని ఇంతకు ముందుపనిషత్తు చెప్పింది. అలాగే సూర్యుడే చక్షుస్సంటే సూర్యుడెలా ఒకేచోట ఉన్నా ఆయన దీప్తి సర్వత్రా ప్రసరిస్తున్నదో అలాగే ఆ ప్రజాపతి దృష్టి సర్వతో ముఖంగా వ్యాపించి ఉందని భావం. మరి ఇంద్రుడూ అగ్నీ ముఖమేమిటి. అగ్ని తేజస్సుకూ ఇంద్రుడు జలానికీ సంకేతం. ముఖంలోనే వాక్కు జిహ్వా ఉన్నాయి. వాక్కు అగ్ని దైవత్యం. జిహ్వ రసాత్మకం.
Page 90