ఏమిటిదంతా. వీటిని మాత్రమే చెప్పటమేమిటి. మిగతా జంతు జాలం రాలేదా. వచ్చింది. మానవులూ అశ్వాలూ గోవులూ మేకలూ గొట్టెలూ అన్నప్పుడన్ని ప్రాణులకూ అది ఉపలక్షణంగా Indication తీసుకోవాలి మనం. ప్రాణులేనా. ప్రాణం లేని జడపదార్ధాల మాటేమిటి. అవి సృష్టి కాలేదా. అయ్యాయి అవి కూడా. వాటిని కూడా సూచన చేయబోతాడు తరువాత. సమస్తమూ అందులో నుంచి సృష్టి అయినప్పుడే ఇదంతా దాని స్వరూప మేననే సర్వాత్మ భావ మందుకో గలడు మానవుడు. అప్పుడే అది సంసారమనే సమస్యకు పూర్తి పరిష్కారం.
యత్పురుషం వ్యదధుః - కతిధా వ్యకల్పయన్ - ముఖం కిమస్య కౌ బాహూ - కావూరూ పాదావుచ్యేతే
ఆ ప్రజాపతి స్వరూపాన్ని ప్రపంచంగా మలిచి తయారు చేశారన్నారే. కతిధా వ్యకల్పయన్. ఎన్ని భాగాలుగా విభజించారా యనను. ఎవరా విభజించిన వారు. మానవుల మనోవృత్తులు. అవే దేవతలు. అవే ఋషులు. మన ఆ ఆలోచనలే అలా వికల్పించి చూస్తున్నాయా తత్త్వాన్ని. ముఖమ్ కిమస్య కౌ బాహూ. వికల్పించినప్పుడా పురుషుడి ముఖమేమిటి. బాహువు లేమిటి. మరి ఊరువులేమిటి. పాదాలేమిటని ప్రశ్న వచ్చింది. నిర్వికల్ప మయినప్పుడే గొడవా లేదు. అదే సవికల్ప మయినప్పుడీ దృష్టి కనుగుణంగా కనపడాలి గదా అది.
Page 86