#


Index

మంత్రపూర్వకంగా ఆహుతి చేశారు. ప్రజాపతి నాహుతి చేయటమేమిటి. జ్ఞానమేగా ప్రజాపతి అంటే. అది ఎలా ఏర్పడిందసలు. పరమ పురుషుడి సంకల్పమే గదా ప్రజాపతి రూపం ధరించింది. అదే మరలా సంకల్ప బలంతో మరొక రూపం ధరించబోతున్నది. ఆంతర్యమేమంటే జ్ఞానం సంకల్పంగా మారటమే అది ఆహుతి కావటం. అది వేరొక సంకల్పం చేస్తే అదీ ఆహుతే. ఇలా అమూర్తమైన సంకల్పం మూర్తీభవిస్తే అదే జన్మ. మూర్తమై కనిపించటమే జన్మ.

అయితే ఆహుతి అయినదేదో చెప్పారు. ఆహుతి చేసిన వారెవరు. వారే దేవతలూ సాధ్యులూ ఋషులూ నంటున్నది మంత్ర వర్ణం. అయజంత- వీరు ముగ్గురే చేశారు యజనం. ఎవరీ ముగ్గురూ ఎలా అర్థం చేసుకోవాలి మనం. దీవ్యతీతి దేవః - ప్రకాశించే స్వభావమున్న దేదో అది దేవ. ప్రకాశమేదో గాదు జ్ఞానమే ప్రకాశం. దేవాః అంటే అప్పటికి జ్ఞానులన్న మాట. వారే సాధ్యులు సాధన సంపత్తి దగ్గరున్న వారు. అలాటి వారే ఋషులు కూడా. ఋ అనే ధాతువుకు దర్శనమని అర్థం. దర్శించే వాడే ఋషి. పరమార్ధాన్ని దర్శించే వారే ఋషులంటే అలా దర్శించాలంటే మనః ప్రాణాది సాధన సంపత్తి ఉండాలి వారికి. సాధన సామగ్రి ఉన్నా దాన్ని ఉపయోగించుకొని తద్ద్వారా పరతత్త్వాన్ని దర్శించే విజ్ఞాన బలముండాలి. కనుకనే దేవా స్సాధ్యాఋషయః అనే మాటలతో భంగ్యంతరంగా సూచిస్తున్నాడీ రహస్యం.

Page 78