గనుక ఇది విరాట్పురుషుణ్ణి వారొక యజ్ఞ పశువుగా చేసి యూప స్తంభానికి కట్టినట్టు కట్టి వేశారట. యజ్ఞంలో పశువును శాస్త్రోక్తంగా మంత్ర జలంతో ప్రోక్షణ చేసి వధిస్తే గాని యజ్ఞ ఫలం ప్రాప్తించదు. ఇక్కడ కూడా అదే సూత్రం. ఇక్కడ మానస యజ్ఞంలో ప్రజాపతి స్వరూపం మృతమై భౌతికంగా మారితే గాని భౌతికమైన ప్రపంచ సృష్టి ఫలించదని తాత్పర్యం. అయితే ఈ మారటం వివర్త రూపమైన ఆ భాసే కాబట్టి మారినట్టు భాసించటమే గాని వాస్తవమైన మార్పు కాదు. కార్య కారణాలు రెండూ ఒకే ఒక తత్త్వం. ఈ అద్వైత భావం మనకు బాగా అవగాహనకు రావటానికి ఒక గొప్ప కల్పన చేసి వర్ణిస్తున్నది పురుష సూక్తం మరలా. దీనినే అర్థ వాదమని పేర్కొన్నామింతకు ముందు. వినండి. ఎంత చిత్రంగా వర్ణిస్తున్నదో.
తం యజ్ఞం బర్హిషి ప్రొక్షన్ పురుషం జాత మగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే
తం యజ్ఞం. ఆ యజ్ఞాన్ని. యజ్ఞమంటే ఇక్కడ జ్ఞానమే యజ్ఞమని గదా చెప్పాము. ప్రజాపతి భావనే అది. పురుషం జాత మగ్రతః అదే మొట్టమొదట జన్మించిన పురుషుడు. పరమ పురుషుడైన నారాయణుడి తాలూకు సంకల్పమే ప్రజాపతి రూపంగా జన్మించింది. దాన్ని మరలా బర్హిషి ప్రాక్షన్. బర్హిస్సంటే అగ్ని హోత్రం.
Page 77