#


Index

  వీటి సూక్ష్మాతి సూక్ష్మమైన మూల తత్త్వాలు. అవి స్థూల రూపం ధరిస్తే భూతమవుతాయి. ధరించకుండా అలాగే అవ్యక్తంగా ఉండిపోతే ఆ దశలో నిరాకారం. గనుక మృతం కావవి అమృతం. భూతాలుగా మారి సాకారమైతే అమృతం కావప్పుడు మృతం.

  ఇప్పు డేమయిం దింతకూ. ఒకే పురుష తత్త్వం తేజోబన్నాత్మక మైన శక్తి రూపంగా ఎలాటి మార్పు లేకుండా అమృతంగా ఉంటూనే అదే వ్యక్తమయి భూత ప్రపంచ రూపంగా బయటపడితే మృతమై పోతున్న దెప్పటికప్పుడు. అప్పటికి మారుతున్నదీ అదే. మారకుండా ఉన్నదీ అదే. మారకుండా ఉన్నదే ప్రతిక్షణమూ మారిపోతూ ఉన్నది. ఇలా క్షణ క్షణమూ మారుతున్నదని మాటే గాని వాస్తవంలో ఏ మాత్రమూ మారటం లేదది. అనేజ దేకం మనసో జవీయః - అని ఈశావాస్యం ఘోషిస్తున్న సత్యమిదే. నిర్గుణంగా మారదు. సగుణంగా మారుతుంది. నిర్గుణంగా అమృతమూ. సగుణంగా మృతమూ. అయితే ఒక పదార్ధం మృతమని చెప్పినప్పు డమృతమెలా కాగలదు. ఇది పరస్పర విరుద్ధం గదా అంటే వైరుధ్యమేమీ లేదంటా రద్వైతులు. ఎలాగంటే అమృతం దాని స్వరూపం. మృతం దాని ఆ భాస. ఆ భాస వస్తువు గాదు. కాక పోదు. మన నీడ మన శరీరమేనంటారా కాదంటారా. నీడగా చూస్తే కాదు. శరీరంగా చూస్తే అవును.

Page 68