కారణమనే దెప్పుడూ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉపాదానం. Material Cause మరొకటి నిమిత్తం Efficient Cause. ఉపాదానం సామగ్రిని సప్లయి చేస్తుంది. నిమిత్తం దాని నుపయోగించి పని చేస్తుంది. మొదటిది జడం. రెండవది చేతనం. మట్టి జడమైతే కుమ్మరి చేతనుడు. కేవలం మట్టి కుండగా మారలేదు. మట్టి లేకుండా కేవలం కుమ్మరి దాన్ని తయారు చేయలేడు. రెండూ తోడ్పడాలి కుండ అనే కార్యం జన్మించటానికి. అయితే ఒక విశేష మేమంటే కుమ్మరి బయటనే ఉంటాడు. కుండలోపలికి రాడు. మట్టి లోపల జేరి కుండనంతా వ్యాపిస్తుంది. అంటే నిమిత్తం వెలపల మాత్రమే ఉంటే ఉపాదానం కార్యం లోపల ఉంటుంది.
ప్రస్తుతం జగద్ప్యవహారం కూడా ఇంతే. బ్రహ్మాండ భాండ మన్నారు దీన్ని. దీనికి కూడా కుమ్మరి లాంటి ఈశ్వరు డొకడున్నాడు. వాడు నిమిత్త కారణం. కాగా ఉపాదాన కారణమూ ఒకటున్నది. అదే ఆయన నాశ్రయించి ఉన్న పరాశక్తి. తన శక్తి ద్వారా ఈ బ్రహ్మాండ మనే కార్యం లోపలికి వచ్చాడా ఈశ్వరుడు. అంటే సద్రూపంగా జగత్తునంతా వ్యాపించి కనిపిస్తున్నాడు. చిద్రూపంగా దీని కతీతంగా ఉండి దీని వ్యవహారమంతా గమనిస్తున్నాడు. తానూ తన శక్తీ వేరుగావు గనుక నిమిత్తమూ తానే ఉపాదానమూ తానే అనుకొన్నప్పుడు లోపలా వెలపలా కూడా అభిన్న
Page 65