#


Index

  అలాగే అణీయోర్ధ్వా వ్యవస్థితా అని దీర్ఘాంతమైతే దాన్ని వ్యవస్థితః అని విసర్గాంతం చేసి పలుకుతారు. అణీయా అనేది స్త్రీ లింగం. దాని విశేషణం వ్యవస్థితా అని ఉండాలి. పోతే పరమాత్మా అన్నప్పుడది పుల్లింగం. అక్కడ దాని విశేషణం వ్యవస్థితః అని ఉండాలి. అలా కాక రెండింటినీ వ్యత్యస్తం చేసి ఉచ్చరిస్తారీ పంతులు గార్లు. ఇది నేను వారి నాక్షేపించటానికి గాదు. ఇప్పటికైనా కొంత మంచి పాఠమేదా అని చూచి తమకు తెలియకపోతే ఎవరైనా భాషాభిజ్ఞులతో పరిచయముంటే వారి నడిగి తమ తప్పు దిద్దుకోమని నా సలహా.

  ఇలాగా ఉచ్చారణ దోషాలు కొన్ని సరిదిద్దటానికీ - దానికంటే కూడా ముఖ్యంగా ఈ సూక్త త్రయంలో నిగూఢంగా ఉన్న అంతరార్ధమేమిటో అది మన జీవితానికి గమ్యమైన పరమార్ధాన్ని ఎలా ప్రసాదిస్తుందో అదీ పాఠక లోకానికి యధాశక్తిగా వివరిస్తే బాగుండునని నేనీ వ్యాఖ్యానానికి పూనుకొన్నాను. అసలు నా వరకు నాకీ సూక్తత్రయమేమి చెబుతున్నదీ అది నాకు జీవిత పరమార్ధాన్ని ఎలా బోధిస్తున్నదీ లోతుకు దిగి ఆ రహస్యాన్ని పట్టుకోవాలని కుతూహలం. అది నాలోనే సమసి పోక పదిమంది జిజ్ఞాసువులూ పంచుకొని దాన్ని తామూ ఆకళించు కోగలిగితే చూడాలని ఆకాంక్ష.

Page 6