ఇప్పుడీ శక్తి తత్త్వమే శ్రీ. అది దేని నాశ్రయించి ఉన్నదో అది పురుష. శ్రీ అంటే ఆశ్రయించేదనే గదా అర్థం చెప్పాము. శక్తి అనే దెప్పుడూ అచేతనం కాబట్టి తనపాటికి తానుండ లేదు. ఒక చేతన పదార్ధాన్ని అంటి పట్టుకొని ఉంటేనే దానికి ఉనికి. ఆ చేతన పదార్ధమే పురుష. పురుష అంటే మగ అనీ శ్రీ అంటే ఆడ అనీ గాదు అర్ధం. అది కేవలం బాహ్యమైన శబ్దార్థం. అంతరార్థ మేమంటే పూర్ణత్వా త్పురుషః పరిపూర్ణమైన చైతన్యానికే పురుష అని పేరు. అలాగే దానితో అవినాభూతంగా ఉన్న పరిపూర్ణ శక్తికే శ్రీ అని పేరు. అర్థ నారీశ్వరం లాగా రెండూ ఒకే ఒక తత్త్వం. అలాగే భావించాలి మనం. శివ శక్తులివి రెండూ చెప్పు కోటానికి రెండుగా కనపడుతున్నా వాస్తవంలో ఉన్నదెప్పుడూ శివతత్త్వమే. అదే పురుష.
కాని అది తన పాటికి తాను నిరాకారమైన జ్ఞానమే కాబట్టి నామరూపాదులైన ఏ ఉపాధులతో సంసర్గం లేకుండా నిరుపాధికమయి ఉంటుందెప్పుడూ. అయినా దానితో ఒక అఖండమైన శక్తి కూడా కలిసి మెలిసి ఉంది కాబట్టి ఆ శక్తి ప్రభావంతో ఇచ్ఛా క్రియా ఫలానుభవాలనే భూమికలలో క్రిందికి దిగి వచ్చింది. వచ్చిందంటే నిజంగా వచ్చిందని గాదు మరలా. రావటానికీ పోవటానికీ దానికన్యంగా వేరొక దేశమనీ కాలమనీ వస్తువనీ ఉంటేగా. మరి అలాంటప్పుడు దిగి వచ్చిందని ఎలా చెప్పారు.
Page 58