అన్నిటికన్నాఉన్నతమైన దివి నుంచి అంటే చిదాకాశం నుంచి. ఎలాంటిదా దివి. అభ్రస్య. అప్పులంటే నామరూప క్రియలు. వాటిని భరించినది. తనలో గుప్తంగా ఉంచుకొన్నది. వాటినే విద్యుత్తులుగా మార్చి వర్షించు గాక. విద్యుత్తులంటే ఇక్కడ చిత్ప్రకాశ కిరణాలు. వాటిని ముముక్షువులైన మామీద వర్షంతు వర్షించు గాక.
వర్షిస్తే ఏమవుతుంది. రోహంతు సర్వ బీజాని. ఆ తేజః కిరణ బీజాలే మా మనసులలో ప్రవేశించి మొలకెత్తాలి. పెరిగి పెద్దవయి అఖండాకార ప్రకాశంగా మారి మమ్మను గ్రహించాలి. అనుగ్రహిస్తే బ్రహ్మద్విషః అప జహి. బ్రహ్మ పదాన్ని మాకు కనపడకుండా దూరం చేసిన శత్రువులున్నారే ప్రాపంచికమైన వృత్తులు. వాటిని నీవు త్రోసి పుచ్చి మమ్ము కాపాడిన దానవవుతావు తల్లీ. ఆధ్యాత్మికంగా చెప్పుకొంటే ఈ మంత్రాని కర్థమిదీ.
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోమకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్త
అతిలోకమైన అత్యుత్తమ పద ప్రాపకమైన విద్య కాబట్టి అది-దానినే పునః పునః వర్ణించి చెబుతున్నాడు. అలా చెబితేనే అది సాధకుల మనస్సులకు బాగా పడుతుందని ఉద్దేశం. అమ్మా నీకు పద్మాలంటే ప్రియం. పద్మాలేవో గావు. ఈ చరా చర ప్రపంచాలే. నీవు పద్మినివి. అవన్నీ నీ సొంతం. పద్మ హస్తవు. వాటిని నీ చేతిలో పెట్టుకొని నడుపుతున్నావు.
Page 47