#


Index

  ఏమిటీ మాట. ఇది ఐహిక ఫలానికి చెప్పిన మాట. ఇదీ కావలసిందే మనకు. కాని ఇదే గాదు జీవిత పరమార్థం. పరమార్ధాన్ని సూచించే విషయం వేరే ఉంది.

  అదేమిటంటే శుచిత్వమంటే మానసికమైన నైర్మల్యం. మనః ప్రసాద మంటారు దీన్ని. దైవ గుణాలలో మొట్టమొదట ఉండవలసిన గుణమిది. అని భగవద్గీత చాటి చెబుతున్నది. మనసు నిర్మలంగా ఉంటేనే జ్ఞాన బీజాలంకురిస్తాయి అందులో. అప్పుడు జుహుయాదాజ్యం. ఆ జ్ఞానాగ్ని హోత్రంలో ప్రాపంచికమైన భావాలన్నీ ఒక హవ్యంలాగా అందులో పూర్ణాహుతి చేయాలి ముముక్షులైన మానవుడు.

  మనసులో ఉదయించే భావాలూ లేదా వృత్తులనేవి ఎన్నో అసంఖ్యాకంగా ఉన్నాయను కోవచ్చు మనం. అవి ఎన్ని లక్షలు కోట్లయినా అన్నీ కలిసి పంచదశ. పదిహేనింటిలో చేరిపోతాయి. గతాః కలాః పంచదశ ప్రతిష్ఠాః అని ఉపనిషత్తు. ఈ పదిహేనుకూ కళలని పేరు. కళ అంటే పరిపూర్ణ చైతన్యంలో ఏర్పడే భాగాలు. అవే వృత్తులు. వృత్తి రహితమైనది అఖండం పరిపూర్ణం. అప్పుడది నిర్వికల్పం Without parts అదే వృత్తులుగా మారిపోతే సవికల్పం. వికల్పం వృత్తి కళ అన్నీ ఒకటే. సవికల్పానికి సకలమనీ నిర్వికల్పానికి అకలమనీ పేరు. సకలంగా ఉన్నంత వరకూ మోక్షం లేదు. అది నిష్కలమైతేనే.

Page 41