#


Index

  కాని అలా జరగాలంటే బ్రహ్మ విద్యా బలం లేకుండా జరగదు. ఆ విద్య ఏదో గాదు. శ్రీ. శ్రియం వాసయ మేకులే - మాతరం పద్మ మాలినీం. కనుక అలాటి శ్రీని వాసయమే కులే. నా ఇంటిలో ప్రవేశపెట్టు. అక్కడే నివసించేలా చేయి. ఇల్లంటే ఇల్లనే గాదు. మనసే ఒక ఇల్లు. అందులోనే గదా ఉదయించాలా విద్య. చిక్లీత అంటే రజస్సు. అది మానవుడికి ప్రత్యేకమైన గుణం. సత్త్వం దేవతలకూ తమస్సు దానవులకైతే రజస్సు మానవుల గుణం. అన్నీ పోగు చేసుకొనే లక్షణం. అందుకే ఓ చిక్లీతా ఓ రజోగుణమా నా ఇంట్లో అన్నీ తెచ్చి పెట్టు. నా ఒంట్లో అన్నీ తెచ్చి పెట్టమని బ్రతిమాలుతున్నాడు.

  కాని కోరుకోటం వీడి స్వభావమే అయినా ఇవీ అవీ ఐహికమైనవన్నీ పోగు చేసుకొంటే క్షేమం లేదు వీడికి. ఇదంతా ప్రేయస్సే గాని శ్రేయస్సుగాదు. శ్రేయస్సు వీడి కెప్పటికైనా శ్రీయే. అదే మోక్షాన్ని చేర్చే లక్ష్మి. కనుక నిచదేవీ మాతరం శ్రియం వాసయమే కులే - ఓ చిక్లీత. వీటన్నిటి కంటే నాకు శ్రేయోదాయకమైన నాకు జీవిత గమ్యమైన మోక్షానికి దారి చూపే తల్లి లాంటి శ్రీ ఏదైతే ఉన్నదో ఆ తేజోరూపిణి అయిన బ్రహ్మ విద్యనే మేకులే నా మనసులో శ్రియం ని వాసయ ప్రవేశ పెట్టు. నిరంతరం నాకా ఆలోచన కలిగేలా చూడు. అని కోరుకోవాలి మానవుడు.

Page 37