బ్రహ్మమెలా అఖండమో దాన్ని చేర్చే వృత్తి కూడా అఖండాకారమే. అలాటి దాన్ని ప్రాపంచికమైన ఖండ వృత్తులెలా ఎదిరించి బ్రతకగలవు. ఎదురు లేకుండా వ్యాపిస్తుందది. అంతర్యామి రూపంగా బ్రహ్మాండాన్ని జ్ఞాన ప్రకాశ రూపంగా పిండాండాన్ని అది ఒక్కటే వ్యాపించింది. పరిమితమైన మిగతా వృత్తులు పరిపూర్ణమైన దాన్ని ఎలా నిరోధించ గలవు. కనుక దురాధర్ష అది.
అంతేకాదు. నిత్యపుష్టాం కరీషిణీం. నిత్య పుష్ట అది. దాని పుష్టికి కొరత లేదు. ఎప్పుడూ బలంగానే ఉంటుంది. నీవూ నేనూ దానికి క్రొత్తగా బలమివ్వ నక్కర లేదు. మనమివ్వక ముందే అది బలం పుంజుకొని ఉన్నది. అన్ని చిత్తవృత్తుల కన్నా బలమైన వృత్తి. ఆత్మాకార వృత్తి. అది సవితు ర్వరేణ్యం భర్గః - కనుకనే దాన్ని ధీమహి అని మన హృదయంలో నిలుపుకొంటే మిగతా వాటినన్నిటినీ ప్రచోదయాత్ త్రోసి పారేయగలదు. అదే కరీషిణీం. కర్షిణీయే కరీషిణీ. కర్షిణి అంటే కర్షణం చేసేది. లాగి పారేసేది. మనసు లోపల పేరుకొని ఉన్న వృత్తులనూ వాసనలనూ అపకర్షణం చేసేది. ప్రక్కకు లాగేసేదని అర్థం. అందరి మనస్సులనూ అలా క్షాళితం చేయాలంటే అందరిలోనూ ఉండాలది. అదే ఈశ్వరీం సర్వభూతానాం. సమస్త ప్రాణులకూ ఈశ్వరి. అందరి అంతరంగాలలో వచ్చి కూచొని అందరినీ అజమాయిషీ చేస్తున్న మహాశక్తి అది. ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి అని గీత. భ్రామయన్సర్వ భూతాని అని కూడా అన్నది.
Page 33