#


Index

  కాని అనులోమంగా దానినెలా సాధించాలిప్పుడు. ఎలా పట్టుకోవాలని ప్రశ్న వచ్చింది. దానికిస్తున్నాడు సలహా. తా మిహోపహ్వయే శ్రియమ్. ప్రతిలోమంగా మన మనసులో నుంచి నెట్టి వేయవలసింది అలక్ష్మి అయితే అనులోమంగా పట్టుకోవలసింది లక్ష్మి. మోక్ష మార్గాన్ని సూచించేది. మనలను చేర్చేది. అదే శ్రీ. ఆ శ్రీని ఉపహ్వయే -నాదగ్గరికి ఆహ్వానిస్తున్నాను. అది బ్రహ్మ విద్యారూపిణి కాబట్టి నాలో ప్రవేశించి నన్నా మార్గంలో నడిపించాలి. ఎలాగని. గంధ ద్వారాం. దురాధరాం. పరమాత్మ ఒక పుష్ప మనుకొంటే దాని గంధం దాని సువాసన శక్తి. పుష్ప మొకే చోట ఉంటే దాని వాసన దశదిశలా వ్యాపిస్తుంది. అలాగే పరమాత్మ కూటస్థ మచలం ధ్రువం. కదలడు మెదలడు వస్తు సిద్ధంగా. కాని ఆయనతో అవినాభూతంగా ఉన్న మహాశక్తి నామరూపాత్మకంగా సమస్త సృష్టినీ వ్యాపించి ఉంది. ప్రత్యక్షంగా కనిపించే ఈ నామరూపాలే ద్వారం మనకా పరమాత్మను చేరటానికి. ఈశావాస్య మిదగ్ం సర్వమని గదా ఉపనిషత్తు మాట. ఇదంతా ఈశవాసనా వాసితమే కాబట్టి ఈ వాసనతో మన బుద్ధి వాసితమైతే చాలు. ఆ ఈశ్వరాకార వృత్తే మనకాలంబమయి పరమాత్మను పట్టిస్తుంది. కనుక అది గంధ ద్వార. గంధద్వారే గాక దురాధర్ష కూడా. ఆధర్ష అంటే అటకాయించటం ఎదిరించటం. ఏదీ దాన్ని ఎదిరించ లేదు. అలాంటి వృత్తి అది.

Page 32