#


Index

   చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం - శ్రియం లోకే దేవ జుష్టాము దారాం - తాం పద్మినీం శరణ మహం ప్రపద్యే. చంద్రాం. చంద్రుడంటే మనస్సు. మనస్సుకు హితమైనదీ సరియైన మార్గంలో నడిపించేదీ కావాలి. ప్రభాసాం. సర్వత్రా ప్రకాశించేదయి ఉండాలి. యశసా జ్వలంతీం. అలా ప్రకాశిస్తూ మోక్ష మార్గాన్ని ప్రకాశింప జేసి చూపుతూ పోవాలి మనకు. ఎంతోమంది జిజ్ఞాసువుల కలాటి జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తులను చేసిన యశస్సున్నది దానికి. అలాటి యశస్సుతో వెలిగిపోతున్నది. శ్రియం లోకే దేవజుష్టా ముదారాం- అలా చూపటమే గాక మనమా గమ్యాన్ని అందుకొనేలా చేయాలి. బ్రహ్మవేత్తలైన వారెందరో మనకంటే ముందలా అందుకొన్న వారే. అలాటి ఉదారమైన విద్య అది. తాం పద్మినీం శరణ మహం ప్రపద్యే. పద్మాలన్నిటిలో విహరించేదా శక్తి. పద్మాకారంగా ఉండే అండ పిండాది గోళాలే పద్మాలు. అనంత కోటి బ్రహ్మాండ జనని కాబట్టి అన్ని లోకాలనూ వ్యాపించి ఉన్నదా శక్తి అనటంలో ఆశ్చర్యం లేదు. అలాటి మహాశక్తిని శరణు వేడితే చాలు. దాని ప్రభావం నా మీదా పనిచేస్తుంది. అందుకే శరణు వేడుతున్నాను.

  అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శరణు వేడితే మనకు కలిగే ఫలితాలు రెండు. ఒకటి అది లక్ష్మి అయి మనకు గమ్యం చూపుతుంది. మరొకటి లక్ష్మి గాని అలక్ష్మి ఒకటి ఉన్నదే అది నశ్యతాం నశిస్తుంది. ఇక్కడ లక్ష్మి అంటే దారి చూపేది.

Page 23