కాబట్టి ఇదంతా ఆయన ఐశ్వర్యమే. ఈశ్వర స్సర్వ విద్యానాం- ఇందులో ఎవరెన్ని విద్యలు సాధించినా అవన్నీ ఆయన విద్యలే. సర్వజ్ఞుడు గదా. సర్వవిద్యలూ ఆయనే. కనుక ఆయనను పట్టుకొంటే ఐహికాముష్మిక విద్యలన్నీ లభిస్తాయి మనకు. అపర విద్యలే గాక పర విద్య కూడా సిద్ధిస్తుంది. ఈశ్వర స్సర్వ భూతానాం దానితో సకల భూతాల మీదా ఈశ్వర త్వ మాయనకు లాగే మనకూ అబ్బుతుంది. బ్రహ్మాధిపతిః బ్రహ్మమంటే వేద వాఙ్మయం. భౌతిక జగత్తుకే గాక వైజ్ఞానిక జగత్తుకు కూడా అధిపతులమే మనం. బ్రహ్మణోధిపతిః నిరంతర వేదాధ్యయన శీలుడైన బ్రహ్మ దేవుడికి కూడా అధిపతులమే కాగలం. ఆయన బ్రహ్మ కధిపతి అయితే తత్సాయుజ్యం పొందిన బ్రహ్మవేత్త మాత్రం కాలేడా. బ్రహ్మా శివోస్తు - బ్రహ్మేమిటి శివుడేమిటి అంతా మన స్వరూపంలో చేరిపోయేదే కాబట్టి అలాటి పరిపూర్ణ బ్రహ్మానుభవం పొందగలిగితే సదా శివోమ్. ఎప్పటికీ మనం శివ స్వరూపంగానే నిలిచిపోగలం.
ఇక్కడికి మంత్రపుష్పం సమాప్తమయింది. ఓంకారంతో ప్రారంభమయింది. మరలా ఓంకారంతో సమాప్తమయింది. అక్కడ ఓం హంస రూపంగా మనలో ప్రవేశించి ఇక్కడ అదే సోహం రూపంగా దానికి మూలమైన బ్రహ్మ సాయుజ్యాన్ని మన కందించింది.
Page 171