#


Index

  కామేశ్వరుడు కాబట్టి ఆయన చేతిలో ఉన్నాయవి. తప్పకుండా ఇవ్వగలడేది కోరినా. దదాతు. అలా ఇస్తాడనే నమ్మకంతో ఆశ్రయించాలి మనం.

  అయితే ఈ కోరికలనేవి రెండు విధాలు. ఒకటి ఐహికం. మరొకటి ఆముష్మికం. ఆముష్మికంలో కూడా ధర్మ పురుషార్ధం మరలా ఐహికమైన అర్థ కామాలలాగా ఒక కోరికే. ఇవన్నీ తీరాలంటే కామేశ్వరుణ్ణి పట్టుకోవాలి. పట్టుకొంటే వాడు కుబేరుడి రూపంలో మనకు ధన ధాన్యాలిచ్చి సఫలం చేస్తాడు. ధన మూల మిదం జగత్తన్నారు. అర్ధమంటే ధనమే. ధనం లేకుంటే కామం తీరదు. అముష్మికమైన స్వర్గ కామమూ తీరదు. యజ్ఞ యాగాదులకు కూడా పుష్కలంగా ధన ముండాలని చెబుతున్నది శాస్త్రం. పోతే మోక్ష పురుషార్ధాని కొక్క దానికే భౌతికమైన ఈ ధన మక్కర లేనిది. అక్కడ కావలసిన ధనం జ్ఞాన ధనం. కాబట్టి ధనపతి కుబేరుడు కాడది నీకు తీర్చవలసింది. సర్వజ్ఞుడూ సర్వశక్తి సంపన్నుడూ అయిన పరమాత్మ అనే ధనపతి. కుబేరాయ వైశ్రవణాయ - మహారాజాయ తే నమః - ఓ కుబేరుడు గాని కుబేరా వైశ్రవణుడు గాని వైశ్రవణా నీవు స్వయం ప్రకాశ శీలుడవు గనుక నీవే ప్రసాదించాలి ఆ జ్ఞాన ధనాన్ని అని ఆ పరమాత్మనే ఆశ్రయించాలి మోక్ష కాముడైన మానవుడు.

Page 168