అసలు కుబేరుడికి నరవాహనుడని పేరు. కుబేర అంటే కుత్సితమైన శరీరం. అలాటి వ్యాధిగ్రస్తుడు గనుకనే ఒక నరుడాయన నెప్పుడూ మోసుకొని పోతుంటాడట. ఇది పురాణ గాధ.
పోతే ఇక్కడ పరమాత్మ నరవాహనుడెలా అయ్యాడు. ఆయన శరీరమేమిటి. అది కుష్ఠ రోగ గ్రస్తమెలా అయింది అంటారేమో. పరమాత్మ శరీరమేమి టంటారు. నామరూపాత్మకమైన ఈ చరాచర ప్రపంచమే. ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ కాలానుగుణంగా దెబ్బతినేది కాబట్టి కుత్సితమే. వ్యాధి గ్రస్తమే. కూటస్థమైనా ఆయన సర్వత్రా వ్యాపకుడు కాబట్టి తన పాటికి తాను కదలి పోక పోయినా - జీవ రూపంగా ఈ శరీరాల్లో చేరి కదలిపోతూనే ఉంటాడు. తదే జతి తన్నై జతి అని గదా శాస్త్రం చెబుతున్నది. నరుడంటే జీవుడే. పరమాత్మను మోస్తున్నాడు. ఇటూ అటూ తిరుగుతూ ఆయనను తిప్పుతున్నాడు. అంటే జీవాత్మ నధిష్ఠించే ఉన్నదన్ని దశలలోనూ ఆ పరమాత్మ. ఇదీ దాని లక్ష్యార్ధం.
అంచేత స్థావర జంగమాత్మకంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం భావించి దానినే సేవించాలి నిత్యమూ. ఎందుకోసం. సమే కామాన్ కామ కామాయ మహ్యం. ఎన్నో కోరికలున్నాయి నీకూ నాకూ. కామ కాములం మనం. అవి మన పాటికి మనం స్వశక్తితో పొందలేము. కామేశ్వరో వైశ్రవణో దదాతు. కోరటం మన వంతయితే అవి తీర్చట మాయన వంతు.
Page 167