#


Index

  ఈ ఒక్కటి సంపాదిస్తే చాలు. అవి కూడా దీనితో పాటు అప్రయత్నంగానే నేను పొందగలను. అది సామాన్యమైతే ఇవి విశేషాలు. అది పరిపూర్ణమైతే ఇవి పరిమితమైనవి. పరిపూర్ణం సాధిస్తే పరిమిత మైనవన్నీ అందులోనే కలిసి వస్తాయి. సముద్రంలో చేస్తే చాలు. సకల నదులలో స్నానం చేసిన ఫలితమంతా కలిసి వచ్చినట్టే. ఏమిటా పరిమితమైన సంపద అంటావా. గామశ్వం పురుషా నహం. గోసంపదా అశ్వ సంపదా పురుష సంపదా అన్ని సంపదలూ లభిస్తాయి నాకు.

  ఏమిటీ మాట. గోవులూ అశ్వాలూ మందీ మార్బలమూ ఎవరికి కావాలంటారు. బ్రాహ్మణుడికా క్షత్రియుడికా వైశ్యుడికా. అందరూ గృహస్థులే అయినా బ్రాహ్మణ వైశ్య జాతుల కివన్నీ అక్కర లేదు. ఒకవేళ గోవులు కావలసి వచ్చినా గుఱ్ఱాలతో పనిలేదు వారికి. అలాగే దాసదాసీ జనం కూడా అంత హేరాళంగా ఉండనక్కర లేదు. మరి ఎవరికి కావాలంటా రివి. ఇవన్నీ కావలసిన వారు క్షత్రియులైన గృహస్థులే. క్షతం నుంచి కాపాడవలసిన వారు వారే. క్షతమంటే ఆపద అనర్థం. అది లోకుల కెవ్వరికీ కలగకుండా చూడవలసిన డ్యూటీ రాజులదే. వారా విధి నిర్వహించాలంటే రధ గజాశ్వాది బలమూ సైనిక బలమూ అన్నీ సంపన్నమై ఉండాలి వారికి. వారికుంటే చాలు. మనకందరికీ ఉన్నట్టే.

Page 16