#


Index

  దాని నడుమ ఉందట ఒక వహ్నిశిఖ. అగ్ని జ్వాల. దేని నడుమ అంటారు. హృదయాగ్ని నుండి వెలువడే నాడులన్నింటి నడుమ. చెప్పాము గదా శతం చైకా హృదయస్య నాడ్యః అని. 72 వేలున్నాయి ఈ శరీరంలో నాడులు. అందులో 101 నాడులు హృదయానికి సంబంధించినవి. అందులో ఒక నాడి ఇప్పుడు పేర్కొంటున్న ఈ అగ్ని జ్వాల. అగ్ని జ్వాలలాగానే రక్తంతో నిండి రక్త వర్ణంగా భాసిస్తుంటుంది. అది అణీయా. అణో రణీయాన్ అన్నట్టు అణువు కన్నా సూక్ష్మమైనది. అది ఊర్ధ్వా వ్యవస్థితా. ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేయటానికే వ్యవస్థిత మయి ఉంది. అనగా నియతమయి Fixed ఉంది. మిగతావన్నీ మిగతా చోట్లకు బయలుదేరి పోతుంటే ఇది ఒక్కటీ మాత్రం సరాసరి పైకి వెళ్లిపోతుంటుంది. తాసాం మూర్ధాన మభినిస్సృతైకా అని చాటుతున్న దుపనిషత్తు. మూర్థమంటే శిరః కపాలం. అది శరీరానికి పయి భాగాన్నే కదా ఉన్నది. అంచేత ఊర్ధ్వమంటే శిరస్సు కని అర్థం. దీనికే బృహత్సిర అని పేరు భౌతిక శాస్త్రంలో. మన అధ్యాత్మ శాస్త్రంలో సుషుమ్నా నాడి అంటారు దీన్ని. దేదీప్యమానంగా వెలిగి పోయేదని శబ్దార్ధం. ఒకవైపు ఇడా మరోవైపు పింగళ అని రెండు నాడులుంటాయి దీనికి. ఇది వాటి రెంటి మధ్యా ఉండి హృదయ ప్రదేశం నుంచి సరాసరి మెదడుకు అభిముఖంగా బయలుదేరి పోతుంది. దాని ద్వారా రక్తం సరఫరా అవుతుంటే మానవుడి మెదడు పనిచేస్తుంటుంది. అదే బుద్ధి వృత్తి.

Page 158