బట్టి ఆమాట అన్నారు. ఘటోపాధిని బట్టి ఘటాకాశ మన్నట్టు అన్నారా మాట. ఘటంలో ఉన్నా దాని బయట ఉన్నా ఆకాశ మాకాశమే. దాని విస్తారానికి లోటు రాదు. అలాగే హృదయంలో ఉన్నా దాని బయట ఉన్నా ఈ చిదాకాశానికి కూడా తేడా రాదు.
తస్మిన్ సర్వం ప్రతిష్ఠిత మంటున్నది మంత్రం. దానిలోనే ఈ చరా చర పదార్ధ జాతమంతా ప్రతిష్ఠిత మయి ఉందట. ఇప్పుడీ బాహ్యాకాశంలో సూర్యచంద్రాది సమస్త గోళాలూ - అందులో నివసించే చరా చర పదార్ధాలూ ఎలా అంతర్గతమయి అందులోనే తల దాచుకొంటున్నాయో - అలాగే ఈ జడాకాశంతో సహా అవన్నీ ఇప్పుడు చెప్పిన హృదయాకాశంలో చేరిపోయి ఉన్నాయి. ఒక్క ఆకాశం చాలదా అన్నీ కలిసి దానిలోనే ఉన్నాయని చెప్పటానికి. మరలా హృదయాకాశమని ఇంకొకటి చెప్పటం దేనికి. అది కూడా అందులోనే అంతర్గతమయి ఉంది గదా. నిజమే. కాని అది జడమైతే ఇది జడం కాదు. చేతనం. అది ప్రమేయమైతే ఇది దానికి కూడా ప్రమాణం. జ్ఞాన స్వరూపం. అంచేత వాస్తవంలో ఇదే ఈ జ్ఞానమే ఆకాశం. ఆ సమంతా త్కాశతే ఇత్యాకాశః అంతటా వ్యాపించి ప్రకాశిస్తున్నది స్వయం ప్రకాశమైన ఈ చిదాకాశమే.
అయితే హృదయ మంటున్నారు చైతన్య మంటున్నారు. హృదయమూ దానిలో ఉన్న ఖాళీ రెండూ అచేతనమే గదా ఇది చిదాకాశమెలా అయింది.
Page 153