#


Index

  దానికి క్రింది భాగ మధో నిష్టి. అలాగే నాభ్యాముపరి. మన నాభి మండల ముందే దానికి పయి భాగం. వితస్త్యంతే. వితస్తి అంటే జాన. అంటే ఏమని అర్థం. నిష్టికి జానెడు క్రింద - నాభికి జానెడు పైన కొలిచి చూస్తే ఆ మధ్యలో ఉంది హృదయం. అంత మంటే ప్రదేశం. రెండింటి మధ్య ప్రదేశమన్న మాట. అదీ హృదయ స్థానం. అక్కడ తిష్ఠతి ఉన్నదట.

  ఉన్నది నిజమే. దాని స్వరూపమేమిటి. కేవలం మాంస పిండమేనా అది. కాదు విశ్వస్య ఆయతనం మహత్ ఈ ప్రపంచాని కంతా ఆధారమది. ఇంత చిన్నది గదా ఈ హృదయం. ప్రపంచాని కాధారమేమిటి. సమష్టి రూపంగా భావిస్తే ప్రపంచాని కాధారమైన హృదయ మొకటి ఉన్నది. అది సూర్య మండలం. అదీ ఒక మాంసపు ముద్దగానే కనపడుతుంది. అది లేకపోతే ఈ భౌతిక ప్రపంచానికి వెలుగు లేదు. వెలుగు సోకకుంటే ఇది అంధకార బంధురం. నిర్వ్యాపారం. నిరుపయోగం. అలాగే వ్యష్టి రూపమైన ఈ పిండాండానికి కూడా ఆయతన మైనది హృదయం. సూర్య బింబంలాగే ఎఱ్ఱగా వెలిగి పోతుంటుంది. సూర్యమండలం తేజస్సులో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్టే హృదయం తాలూకు తేజస్సు వల్లనే శరీరమంతా ఇలా భాసిస్తూ అన్ని పనులా సాగిస్తున్నది.

  జ్వాలమాలా కులం భాతి - సూర్యమండలం తన కిరణ జాలం చేత పరివేష్టిత మయినట్టే తన నాడీ చక్రం చేత పరివృత మయి ఉంది హృదయం కూడా.

Page 150