అంచేత మనసుకు హృదయానికీ ఉండే ఈ ఆంతరంగికమైన సంబంధాన్ని చూచి మన ప్రాచీనులు రెంటినీ ఏకం చేసి వర్ణిస్తుంటారు. హృదయ పుండరీక మనీ బుద్ధి గుహా అనీ అన్నారంటే రెండూ ఒకటే. మంచాః క్రోశంతి అన్నట్టు హృదయమని ఎక్కడ వచ్చినా అది బుద్ధికి ఉపలక్షణంగా Indicative భావించాలి మనం. ఇప్పుడు విందామిక మంత్రమేమి చెబుతుందో.
పద్మకోశ ప్రతీకాశం- హృదయం చాప్యథోముఖమ్ - అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాము పరితిష్ఠతి - జ్వాల మాలా కులం భాతి విశ్వ స్యాయతనం మహత్ - సంతతగం సిరాభిస్తు లంబత్యా కోశ సన్నిభమ్
మొదట భౌతికమైన హృదయాన్నే వర్ణిస్తున్నది. ఎలా ఉందది. ఎక్కడ ఉంది. మన శరీరంలోనే కంఠానికి దిగువ ఎడమ వైపుందని చెబుతారు శాస్త్రజ్ఞులు. ఎలా ఉంటుందది. అధో ముఖం. అధోముఖంగా కనిపిస్తుంది. మరి దానికి పోలిక కూడా చెబుతున్నది. పద్మకోశ ప్రతీకాశమని. పద్మకోశమంటే తామర మొగ్గ. దానిలాగా ఉందట మన శరీరంలో హృదయం. మొగ్గలాగా ఇది కూడా అగ్రం క్రిందికి తిరిగి కనిపిస్తుంది. ఎక్కడ ఉంటుందో శరీరంలో దాని స్థానం కచ్చితంగా నిరూపిస్తున్నాడు. అధో నిష్ట్యా - నాభ్యాముపరి. మన మెడ క్రింద ఒక గుంత కనిపిస్తుంది చేతితో తడవి చూస్తే దానికి నిష్టి అని పేరు.
Page 149