#


Index

  ఇప్పుడిలాంటి ఆత్మ స్వరూపాన్ని మనమెలా దర్శించాలో దర్శించే విధానమేమిటో అంచెల వారీగా వర్ణిస్తూ పోతుంది ఇక ఉత్తరార్థం. దాని బలంతో మన కిప్పుడున్న పరిచ్ఛిన్నాత్మ భావం వదిలేసి పరిపూర్ణమైన మన ఆత్మ స్వరూప మిది గదా అని క్రమంగా మన మనుభవానికి తెచ్చుకోగలం. క్రమమనే మాట గుర్తుంచుకోండి. ఒక మహాసౌధం నిర్మించాలంటే పునాదుల దగ్గరి నుంచి ప్రారంభించాలి. అలాగే ఇక్కడా అఖండాత్మ మహాప్రాసాదంలో మనం ప్రవేశించాలంటే దీనికే పునాదులు తీయాలి. ఎక్కడి నుంచి. మన శరీరం దగ్గరి నుంచి. శరీరంలో హృదయం హృదయంలో బుద్ధి బుద్ధిలో వృత్తులూ ఆ వృత్తులలో ఒకానొక వృత్తి ఆత్మాకార వృత్తి. తద్వారా పట్టుకోవలసి ఉంటుంది ఆత్మ స్వరూపం. ఇదీ వరస. ఇందులో హృదయం దగ్గరి నుంచి వర్ణిస్తూ పోతుంది మంత్ర పుష్పం. ఇక్కడ ఒక రహస్యం గుర్తుంచుకోవాలి మనం. హృదయమనగానే అది శరీరంలో ఎడమ వైపున్న గుండె అని మాత్రమే అర్థం చేసుకోరాదు. హృదయమంటే Heart గుండెకాయే సందేహం లేదు. కాని అది వాచ్యార్థం. లక్ష్యార్ధ మది కాదు. బుద్ధి. అయితే బుద్ధి అనే చెప్పవచ్చు గదా హృదయమని పేర్కొనటం దేనికి. హృదయం అన్ని నాడులకూ స్థానం. శతం చైకా హృదయస్య నాడ్యః అని ఉపనిషత్తు. ఎన్నో నాడులక్కడి నుండి బయలుదేరుతాయి. అందులో ఒకటి మూర్ధాన మభి నిస్సృతా. కపాలం వైపు సాగిపోతున్నది. తద్ద్వారా రక్తం మెదడుకు సరఫరా అయితే బుద్ధి ఆలోచనా రూపంగా స్పందిస్తుంటుంది. లేకుంటే ఆలోచన లేక అది మొద్దుబారుతుంది. అంతేకాదు. శరీరమే నిలవదు.

Page 148