సర్వమంటున్నాడు పైగా. లోపలా వెలపలే గాక దాని ప్రతి అణువూ అదే వ్యాపించి ఉంది. ఒక్క పిసరు కూడా ఖాళీ లేదు. చరా చర పదార్ధాలలో ఏ ఒక్కటి చూచినా అదే. ఏదీ మాకెక్కడా కనపడలేదే ఆ నారాయణుడీ పదార్ధాలలో, నారాయణుడంటే ఒక దేవతా మూర్తి ఒక వ్యక్తి అనుకొంటున్నారా. అది పొరబాటు. నామరూపాత్మకం కాదది. నరుల కన్నిటికీ ఆయన మని గదా చెప్పాము. నరులంటే జీవజగత్తులని కూడా చెప్పాము. జీవజగత్తులుగా విభక్తమై కనిపించే ఈ చరా చర సృష్టి అంతా విశేషాత్మకం. ఎక్కడికక్కడ విచ్ఛిన్నమయి పోతుంటుంది. ఇది అది గాదు అది ఇది గాదు అనిపించుకోటమే విచ్ఛేదం. అదే విశేషమంటే. అలా విశేషాత్మకంగా ఇవి కనిపిస్తుంటే నిర్విశేషంగా సామాన్య రూపంగా వీటి నన్నిటినీ వ్యాపించి ఒకటున్నది. అదే సామాన్యం. సమానంగా విశేషాలన్నింటినీ వ్యాపించిందేదో అది సామాన్యం. ఒక సువర్ణమూ ఆభరణాలను తీసుకొని చూస్తే తెలిసిపోతుంది.
అలాగే ప్రస్తుత మీ చేతనా చేతన ప్రపంచాన్నంతా వ్యాపించి ఒకే ఒకటుంది. దానికే మహా సామాన్యమని పేరు పెట్టింది బృహదారణ్యకం. ఏమిటది ఎలా ఉంటుంది. సత్ చిత్. ఉంది ఉన్నట్టు స్ఫురిస్తుంది. ఉండటమనే స్ఫురణ అనుకోండి. అదీ అది. చూడండి. మీరీ ప్రపంచంలో ఏదైనా తీసుకొని చూడండి. అణువు మొదలు ఆకాశం దాకా ఏది చూచినా అదంతా ఉందంటావు.
Page 140