#


Index

  ఎందుకు కనిపిస్తున్నదలా. దానికి లేదా దృష్టి. దానికే అది సహజంగా ఉంటే ఎప్పుడూ అలాగే కనిపిస్తుండాలి. మారకూడదు. మాసిపోగూడదు. అజ్ఞాని దృష్టికి మారుతుంటుంది. జ్ఞాని దృష్టికి మాసిపోతుంటుంది. కాబట్టి అజ్ఞానం వదలకుండా చూస్తున్నంత సేపూ ఒక స్వప్నంలాగా ఉన్నట్టు భాసిస్తుందీ త్రిపుటి. అంతకంతకు జ్ఞానోదయమై అంతా నారాయణ స్వరూపమే గదా అని అద్వైత దృష్టితో చూచామంటే ఆభాస తేలిపోయి అది కేవల మేకైకమైన వస్తువుగానే అనుభవానికి వస్తుంది. ఇదీ రహస్యం.



  ఇందులో దాగి ఉన్న ఉపపత్తి ఏమిటో ఇప్పుడీ మంత్రం మనకు బాగా వివరించి చెబుతున్నది. ఆలకించండి.

యచ్చకించి జ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతేపివా - అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః -

  జగత్తు జగత్తని ఏది మనం నిత్యమూ చూస్తున్నామో ఏదైతే వింటున్నామో ఈ కనే ప్రపంచం ఆ వినే ప్రపంచం - అంటే ఇహపరాలు రెండూ కూడా వ్యాపించి ఉన్నదా నారాయణ స్వరూపమే. నారాయణుడేమిటి. అది దీనినంతటి నీ వ్యాపించటమేమిటి. ఎలా వ్యాపించాడంటారు. అంతర్బహిశ్చ. లోపలా వెలపలా కూడా ఉన్నదదే.

Page 139