#


Index

  జాత వేదః మమ ఆవహ. ఓ జాత వేదా నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. మానవుడు. వేదమంటే జ్ఞానం. జాతమంటే అది తనకు సహజంగానే ఉన్నవాడు. ఎవడు. అగ్ని దేవుడా కాదు. ఆ ఉపాధిలో కనిపించే పరమాత్మ. అగ్ని అనేది ఇక్కడ గార్హ పత్యాగ్ని. గృహస్థు లైన బ్రహ్మ క్షత్రాదు లందరూ ప్రతి దినమూ సేవించేది. సేవిస్తే ఈ గృహపతుల కోరికలది ఫలింప జేస్తుంది. అగ్ని భౌతికమైతే దాని కధిదేవత అగ్ని దేవుడు. దాని కధిపతి దేవ దేవుడు పరమాత్మ అది ఈ దేవత ద్వారా నీకైహికమైన భోగమూ దాన్ని కూడా దాటి భావిస్తే మోక్షమూ రెండూ ప్రసాదిస్తుంది. రెండూ దాని ఉపాధులే Media. దానికెప్పుడూ చైతన్యమనేది సహజం. పరాస్యశక్తిః స్వాభావికీ అని చాటుతున్న దుపనిషత్తు. అలాటి ప్రజ్ఞాన స్వరూపుడైన పరమాత్మ నాకీ అగ్నిహోత్రుడి ద్వారా అందివ్వాలని ప్రార్ధన.

  ఏమిటా అందివ్వ వలసినది. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం లక్ష్మి నందివ్వాలట. లక్షింప జేసేది లక్ష్మి అని గదా చెప్పాము. ఆ పరతత్త్వాన్ని లక్షింప జేసే తదాకార వృత్తి నీ సాధకుడి కివ్వాలది. ఎలాంటిదా వృత్తి. హిరణ్మయి. బ్రహ్మాకార వృత్తి గనుక బ్రహ్మ మెలా ఉందో అలాంటిదే. బ్రహ్మం హిరణ్య రూపం. అంటే ప్రకాశ శీలమైనది. కనుక ఇది దానిలాగే ప్రకాశాత్మకమే కావాలి. అంతే కాదు. చంద్రాం. చంద్రుడి లాగా స్వచ్ఛమైనది. సౌమ్యమైనది. ఎలాటి నామరూప వాసనా మాలిన్యమూ లేనిది.

Page 14