#


Index

  నిరాకారం వ్యాపకం దానికేమిటి కారణం. అది విశ్వానికంతా ఆత్మ. ఆ తనో తీత్యాత్మా. అంతటా వ్యాపించిందని అర్థం. ఎలా వ్యాపించ గలిగింది. దానికి రెండు లక్షణాలున్నాయి. ఒకటి సత్. రెండు చిత్. సత్తంటే ఉండటం. చిత్తంటే నేనిలా ఉన్నానని గుర్తించటం. ఉన్నాననే స్ఫురణ ఏదుందో అదీ ఆత్మ. ఆ ఉన్నాననే స్ఫురణ ఇప్పుడు మనందరికీ సహజంగానే ఉంది. కాని ఇది ఈ మూడు మూరల జానెడు శరీరానికే పరిమితమయి ఉంది. దీని హద్దులు దాటి నేనున్నానని నీవూ నేనూ అనుకోటం లేదు. శరీరపుటెల్లులు దాటి చూస్తే నాది అంటావే గాని నేనన లేవు. శరీరంలో ఉన్నప్పుడు కూడా శరీరమే నేనని దానితో ఏకమై ఉంటున్నావే గాని దానికి విలక్షణంగా ఉన్నానని భావించ లేవు. ఇదే దేహాత్మ భావం. లేదా జీవ భావ మంటారు.

   ఈ భావంతో బ్రతుకు తున్నంత వరకూ నీవూ నేనూ జీవాత్మలమే గాని విశ్వాత్మలం కాము. శరీరం దాటి విశ్వమంతా వ్యాపించినట్టు మన ఉనికిని మనం చూచుకోగలిగి నప్పుడే జీవ భావం పోయి ఈశ్వర భావ మందుకోగలం. అప్పుడు విశ్వాత్ముడూ ఈశ్వరుడూ అవుతాడీ మానవుడు. అయితే ఇక ఈ శరీరానికి కలిగే ఏ ఉపద్రవాలూ వాడినంటవు. జనన మరణాలకు కూడా స్వస్తి చెప్పవచ్చు. అంతవరకూ శరీరంతో తాదాత్మ్య మేర్పడిన నేరానికి దాని ఉపద్రవాలన్నీ మనకే సంప్రాప్తించినట్టు కంగారు పడుతుంటాము.

Page 131