#


Index

  బంగారమెలా తన పాటికి తాను కూటస్థంగా ఉన్నా దాని రూపాలైన కటక కుండలా ద్యాభరణాలెలా మార్పు చెందుతుంటాయో - సముద్ర జలమలా నిశ్చలంగా ఉన్నా దానిలో ఉదయించే తరంగ బుద్బుదాది రూపాలెలా రాకపోకలు చేస్తుంటాయో అలాగా ఈ నామరూపాలు కూడా ఎప్పటికప్పుడు వ్యభిచరిస్తూ ఉంటాయి. కనుకనే ఇవి క్షరం. అక్షరం కావు. అపరం. పరం కావు. అక్షరమూ పరమమూ అయినదా మూలపదార్ధమే. మరి ఇదంతా అదే నన్నారు గదా ఈ క్షరా క్షర భేదమెలా వచ్చిందని అడగవచ్చు. దానికి సమాధాన మేమంటే నిరాకారంగా నిశ్చలంగా ఏకంగా ఉన్న ఆ చైతన్య స్వరూపమే తన మాయా శక్తి ప్రభావం మూలంగా ఇలా సాకారంగా చలనాత్మకంగా అనేకంగా భాసిస్తున్నది. అప్పటికొకే ఒక నారాయణ స్వరూపం అక్షరంగానూ క్షరంగానూ ద్విపాత్రాభినయం చేస్తున్నదన్న మాట.

విశ్వతః పరమా న్నిత్యం - విశ్వం నారాయణం హరిమ్

  అదే వివరిస్తున్నా డిప్పుడు. ఈ వివిధ రూపాలుగా కనపడే విశ్వం కంటే అతీతంగా ఉన్నదా మూలతత్త్వం. అందుకే దీని ఉదయాస్తమయాలు దాని నంటవు. అంటకపోతే అది నిత్యం. ఒకే స్థితిలో ఉంటుంది. మరి ఈ విశ్వమంతా ఆ స్వరూపమే అయినా దాని శక్తి దాన్ని హరించింది. హరి అంటే హరించటమే. ప్రక్కకు లాగటం లాగి వివిధ రూపాలుగా చూపుతున్నది.

Page 128