#


Index

  నిరాకారం స్వరూపమైతే సాకారమైన ఈ ప్రపంచమంతా దాని విస్తారం విభూతి. అప్పటికి స్వరూప విభూతులకు తేడా లేదు. రెండూ కలిసి ఒకే తత్త్వం. ఒకే నాణానికి రెండు ముఖాల లాంటివివి. అయినా రెండుగా భాసిస్తున్నదంటే అది కేవలం దానిలో అంతర్గతంగా ఉన్న మాయాశక్తి విలాసమే తప్ప మరేదీ గాదు. ఇది అర్థం చేసుకొని ఈ అనేకత్వం ద్వారా ఆ ఏకైకమైన స్వరూపాన్ని మన స్వరూపంగా దర్శించటమే మనం చేయవలసిన సాధన అంతా. కనుకనే మంత్రం రెండూ చెప్పి రెండింటినీ మరలా ఏకం చేసి చూపుతుంటుంది.

  సహస్ర శీర్షగం దేవం - దేవ అంటే కేవల చైతన్య ప్రకాశమది. అప్పుడది నిర్గుణం. అదే సహస్ర శీర్షాలతో సాక్షాత్కరిస్తున్నది. అంతే కాదు. విశ్వాక్షం - విశ్వశంభువం. సహస్ర నేత్రాలతో కూడా కనిపిస్తున్నది. మొత్తం ప్రపంచానికి కలిగే సుఖం గాని శాంతి గాని దానివల్లనే కలుగుతున్నది. సరే గాని అది శుద్ధ చైతన్య మన్నప్పుడు కేవల నిరాకారమైన తత్త్వం గదా. అలాంటప్పుడీ సహస్ర శీర్షాలేమిటి. సహస్రాక్షు లేమిటి. ఇవెక్కడి నుంచి వచ్చాయీ ఆకారాలు దానికి. ఎక్కడి నుంచో గావు. మనవే ఆ శిరస్సులూ ఆ నేత్రాలూ ఆ శిద్రుత్రాలు మనబోటి మానవులకున్న ఇంద్రియాలూ అవయవాలే దాని ఇంద్రియాలూ దాని అవయవాలు.

Page 125