#


Index

  అయితే వివేకవంతుడైన మానవుడెప్పుడూ మోక్షలక్ష్మినే పట్టుకొని ఊర్ధ్వముఖంగా ప్రయాణం సాగించాలి. అలా సాగిస్తే అదే గాక దానికి దిగువ నున్న మిగతావి కూడా అప్రయత్నంగా లభిస్తాయి. అలాకాక వీటిలో ఏ ఒక్కదానికి ప్రయత్నించినా అది మాత్రమే ప్రాప్తిస్తుంది గాని తతిమావి ప్రాప్తించవు. కర్తవ్యో మహదాశ్రయః అన్నారు పెద్దలు. అంచేత అలాటి మోక్ష ఫలాన్ని మనసులో పెట్టుకొని తత్పరంగానే మన మీ శ్రీ సూక్తాన్ని వ్యాఖ్యానిస్తూ పోవట మెంతైనా శ్రేయస్కరం. అదే ప్రస్తుతం నేను అవలంబిస్తున్న విధానం. ముముక్షువైన మానవుడా పరమ పురుషుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు వినండి.

ఓమ్ - హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ -

  ఓంకారంతో ప్రారంభవుతున్నది మంత్రం. ఈ మంత్రమే గాదు. ఏ మంత్రమైనా ఇంతే. ఓంకారమే ఆది. ఓంకారమే అంతం. ప్రణవ శ్ఛందసా మివ అన్నారు. వేద వాఙ్మయాని కంతటికీ ప్రాణ మోంకారమే. అసలు వేదమేమిటి. లోకమేమిటి. అంతా ఓంకార మయమే నన్నది మాండూక్యం. ఏమిటర్ధం. ఓమంటే సోహం. అది శబ్దం. శబ్ద వికారమే సర్వం. ఎలాగ. శబ్దమంటే స్పందన చలనం. చలనాత్మకమే గదా ప్రపంచమంతా. ఈ చలన మెక్కడి నుంచి వచ్చింది. సః ఆ పరమాత్మ నుంచి వచ్చింది.

Page 12