ఇంద్రియ వృత్తులు బుద్ధి వృత్తులకు మూలమైతే బుద్ధి వృత్తులు బ్రహ్మాకార వృత్తికి హేతుభూత మవుతాయి. బ్రహ్మ వృత్తి కూడా ఒక వృత్తి విశేషమే గదా. మిగతావి విశేష వృత్తులయితే ఇది సామాన్య వృత్తి. అవి అనాత్మ వృత్తులైతే ఇది ఒక్కటీ ఆత్మాకార వృత్తి. ఇదీ తేడా. అయితే ఆ వృత్తుల లోనుంచే ఈ అఖండాకార వృత్తి కూడా జనిస్తుంది. రూపం బ్రాహ్మం జనయంతః - అవే దీన్ని సృష్టిస్తున్నాయి. ఎలాగ. ఇవన్నీ ఖండ వృత్తు లెప్పుడయ్యాయో అప్పుడు వీటికి విలక్షణంగా ఒక అఖండ వృత్తి నివే సూచన చేస్తాయి. దాని జన్మకివే కారణం అగ్రే తదబ్రువన్ అలా జన్మింప జేసిన చిత్త వృత్తులే దేవతలు. ప్రకాశ శీలమైనవి. ప్రకాశ శకలాలవి. ప్రకాశ శకలాలే మహా ప్రకాశాన్ని మనసుకు తేగలవు. అదే దాని జన్మకు కారణమని చెప్పటంలో ఆంతర్యం. అలా జన్మింప జేసి ఆ చిత్త వృత్తులన్నీ ఏమంటున్నాయో తెలుసా.
అంటున్నాయంటే వాటికి నోరావాయా. ఎలా అనగలవని అడుగుతారేమో. అనట మంటే ఇక్కడ సూచించటం. ఏమిని సూచిస్తున్నాయవి. యస్మైవం బ్రాహ్మణో విద్యాత్ - ఎవడికైతే ఇలాటి బ్రహ్మ జ్ఞానం కలిగి దాని బలంతో బ్రహ్మ స్వరూపాన్ని ఉన్న దున్నట్టు దర్శించగలడో వాడు గొప్ప విద్వాంసుడు. జ్ఞాని.
Page 113