#


Index

  అది ఒక తరంగం లాంటిది. తరంగానికి సముద్రమే గదా ప్రభవం. అలాగే ఈ ఆలోచనా తరంగాలన్నిటికీ ఆశ్రయం మన జ్ఞాన సముద్రమే. అప్పటికి క్రియారూపంగా ఒక యజ్ఞం జరుగుతున్నదంటే ఆంతరికమైన జ్ఞానమే ప్రకటమై కర్మగా కనిపిస్తున్నది అద్భ్యస్సంభూతః - అప్పులంటే జలం. ఒక్క జలమనే గాదు. జలమనేది పంచ భూతాలకు సంకేతమని చెప్పాము. పంచ భూతాల కలయిక వల్ల ఏర్పడిందే ఈ శరీరం. పృధివ్యైరసాచ్చ ముఖ్యంగా భూమీ జలమూ ఈ రెండు భూతాలే పనిచేస్తున్నాయి శరీరంలో. అన్నమయమైనది మనస్సు. అది పృధివీ వికారం - ఆపోమయః ప్రాణః అన్నారు. అది జలవికారం. అప్పటికి శరీరం పాంచ భౌతికమైనా అందులో మనస్సూ ప్రాణమే స్పందించే లక్షణమున్నవి కాబట్టి చాలా ప్రధానమైనవి. మనస్సు సంకలిస్తుంది. ప్రాణం చేస్తుంది. ఇదే సూక్ష్మ దేహం. జీవుడి స్థానమిదే.

  విశ్వకర్మణ స్సమవర్తతాధి. విశ్వాన్ని సృష్టించిన వాడు విశ్వ కర్మ పరమాత్మ. వాడి సంకల్ప బలం వల్ల సమవర్తత సృష్టి అయిందిది. ఈ శరీరమూ వాడి సృష్టే. ఇందులో మనః ప్రాణాలనే జీవుడి ఉపాధులూ వాడి సృష్టే. తస్య త్వష్టా విదధ ద్రూపమేతి. త్వష్ట అంటే వడ్రంగి. విదధత్ రూపం ఒక వడ్రంగి చేతికి కొయ్య ఇస్తే వాడు దాన్ని అనేక గృహోపకరణాలుగా తయారు చేసి చూపుతాడు.

Page 101