అలాటి విధ్యుక్త ధర్మమే ప్రతి అధికార సంపత్తి ఉన్నవాడు అనుష్ఠిస్తూ ఉండాలి. అనుష్ఠిస్తే చివరకు దేహ పాతానంతరం తానాచారించిన యజ్ఞ కర్మకు ఫలంగా నాకలోక సుఖాన్ని అనుభవిస్తాడీ యజ్ఞాయుధి అయిన ధార్మికుడు. అదే వాడి మహిమ. అలాటి మహిమ పొందిన వారు మొదటి నుంచీ ఎందరో ఉన్నారు. వారంతా సాధ్యులే. అంటే ఎంతో సాధన సామగ్రి నుపయోగించుకొని చివరకా స్వర్గ ఫలమందుకొన్న మహానుభావులే. ఇదీ కర్మపరంగా మనం చెప్పుకో గల బాహ్యార్ధం. ఇదే బ్రహ్మపరంగా చెప్పుకోవాలి మనం మరలా. అదే దీనికి ముందు మేము చెప్పిన అర్థం.
అద్భ్యస్సంభూతః పృధివ్యైరసాచ్చ - విశ్వకర్మణ స్సమవర్తతాధి - తస్య త్వష్టా విద ధ ద్రూపమేతి - తత్పురుష స్యవిశ్వ మాజాన మగ్రే
అసలీ అంతరార్థమే అర్థం. ఎందుకంటే ఇదే పురుష సూక్తం వివక్షించింది కూడా. అదే వివరిస్తున్నదీ మంత్రం మనకిప్పుడు. అద్భ్యస్సంభూతః - నీవొక యజ్ఞమని చెప్పు యాగమని చెప్పు. అది చేసే వాడెవడు. జీవుడు. వాడేగా కర్త. కర్త అనేవాడు మొదట ఉంటేగా కర్మ అనేది సంభవం. నేను కర్త నను కోకపోతే వాడు కర్తృత్వం పెట్టుకోలేడు. ఈ అనుకోవటమే సంకల్పం. సంకల్పమనేది ఒక వృత్తి.
Page 100