ఆ శక్తి మనకు దూరంగా అక్కడ ఎంత ఉన్నదో అదే మనలో కూడా తిష్ఠ వేసుకొని ఉన్నది. యదేవేహ తదముత్ర - యదముత్ర తదన్విహ అని ఉపనిషత్తులే చాటుతున్నాయి. అయితే మనలో కూడా ఉందంటున్నారే ఏ రూపంలో ఉందది మనలో. విమర్శరూపంగా ఉంది. మానవుడొక్కడే విమర్శించగలడు. ఈ విమర్శ అంతకంతకు సాగుతూ పోయి ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ఆ చైతన్య ప్రకాశం పరిపూర్ణంగా మనకు సాక్షాత్కరిస్తుంది. విమర్శ లేనంత వరకూ ప్రకాశమక్కడే ఉన్నా మనకు స్ఫురించదు. వస్తు సిద్ధమే గాని అది బుద్ధి సిద్ధం కాదు. బుద్ధి సిద్ధమయితే గాని అనుభవ మనిపించుకోదు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అన్నారు. శ్రీ విద్య ద్వారా దానికి వేద్యమైన మృత్యుంజయ తత్త్వాన్ని పట్టుకొంటే మనం కూడా మృత్యుంజయులమే కాగలం. అలాటి పూర్ణానుభవాన్ని మనకు ప్రసాదించే దెప్పటికైనా ఈ శ్రీ విద్యే. దీనికే శ్రీ సూక్తమని నామాంతరం.
శ్రీ అనే దానికి పర్యాయ పదమే లక్ష్మి అనే మాట. లక్షయ తీతి లక్ష్మీః అని లక్ష్మీ శబ్దానికి వ్యుత్పత్త్యర్ధం. లక్షింప జేసేదేదో అది లక్ష్మి. లక్షింప జేయటమంటే చూపటం చూపాలంటే ఎక్కడికి వచ్చి చూపాలది. మనదాకా క్రిందికి దిగి వచ్చి మనకా పరతత్త్వాన్ని చూపాలి. దిగి రాక ముందది ఏమిటి. శ్రీః ఆ తత్త్వాన్ని ఆశ్రయించి ఉంటుంది.
Page 10