అజ్ఞానమే అసలైన చీకటి. దాన్ని దాటిపోతే ఉన్నది జ్ఞానమే. అప్పుడిక అజ్ఞానమెక్కడిది. ప్రపంచమంతా బ్రహ్మ చైతన్య ప్రకాశంతో నిండి ఉంటుంది. అయితే అది మనం తలలు పైకెత్తి చూడాలి అంటే నామరూపాల కతీతంగా విలక్షణంగా దర్శించాలని భావం.
ఎలాంటిదా ప్రకాశమంటే వర్ణిస్తున్నాడు. దేవం దేవత్రా సూర్య మగన్మ జ్యోతి రుత్తమం. దేవ అంటే ప్రకాశం. దేవత్రా మిగతా తేజస్సులన్నింటిలో విలక్షణంగా ప్రకాశించేది. ఉత్తమమైన తేజస్సు. సౌర ప్రకాశంగా కనిపిస్తున్న దదే వాస్తవానికి. దాన్నే మేము శరణు వేడుతున్నాము. వరేణ్యం భర్గః అని గదా మంత్రం పేర్కొన్నది అంచేత అదే వరేణ్యం వరణీయం మనకు. ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కే తవః - ఆ సూర్యమండలంలో అభివ్యక్తమైన తేజస్సునే ఉద్వహంతి. మోసుకొని వస్తున్నాయి. ఏమిటవి. కేతవః దాని కిరణాలు. కిరణమంటే సర్వత్రా చెల్లా చెదరయిన వని అర్ధం. అవి ఆకాశంలో ఒకచోట రాశీభూతమయి ఉన్న తేజో మండలాన్ని మనదాకా పట్టుకొని వస్తున్నాయా లేదా. అదే మోసుకు రావటమంటే. జాత వేదసం - అంటే అగ్నిహోత్రం. సాయంకాల మస్తమించేటపుడా కాంతినీ కిరణాలు తీసుకు వచ్చి అగ్నిలో ప్రవేశ పెడతాయని అర్థం. ఎందుకోసం. దృశే విశ్వాయ సూర్యం - సమస్త పదార్ధాలనూ చూడాలి గదా మానవుడు. ఎలా చూస్తాడు వెలుగు లేకపోతే.
Page 97