ఆయన వెలుగులోనే గదా మనసా వాచా కాయేన మనమే కర్మ చేసినా చేస్తున్నాం. అందుకే ఆయనకు కర్మ సాక్షి అని కూడా పేరు వచ్చింది. తాను చేయకుండా తన వెలుగులో మనం చేస్తుంటే చూస్తున్నాడని అర్ధం. అందుకే జగచ్చక్షువూ కర్మసాక్షీ అయ్యాడాయన.
సత్యాయ హవ్యం ఘృతవ ద్విధేమ. ఆ సత్య స్వరూపుడైన సూర్య భగవానుడికి కావలసిన హోమ ద్రవ్యాలన్నింటినీ ఘృతవత్ నేతిలో ముంచి ఆజ్యమన్నింటినీ పవిత్రం చేస్తుంది గనుక తత్పురస్సరంగా విధేమ సమర్పిస్తాం. ఏదైనా అగ్నిలోనే హోమం చేయాలి. సూర్య తేజస్సే అగ్ని. అదే మనకీ ప్రాణమిచ్చింది. మనసిచ్చింది. కనుక ఈ మనః ప్రాణాలు నీవే సుమా అని దానికే సమర్పించటం మరలా. అందులో హవ్యం మనస్సూ ఘృతం ప్రాణం. వీటి వ్యాపారాలన్నీ ఏ సౌర తేజస్సు వల్ల కలుగుతున్నాయో అవి మన సొంత మను కోకుండా దానికే సమర్పించాలి. సొంతమనుకొంటే మనం దానికి బద్ధుల మవుతాము. సమర్పిస్తే బంధ విముక్తుల మవుతాము. అయితే అది బద్ధం కాదా అంటే కాదు. అది సత్యం అంటే సత్య స్వరూపుడైన పరమాత్మే కనుక దానికి బంధ మోక్షాల ప్రసక్తే లేదు. నిత్యముక్తమది. దాని సగుణమైన ఉపాధే ఈ సౌరమండలం. అప్పటికి మన తను మనః ప్రాణాలన్నీ భగవ దంకితం చేయాలని తాత్పర్యం.
Page 91