విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయుః - అంతేగాక మొత్తం విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు. నీవే విశ్వాని కాయుస్సు. అంటే దాని బ్రతుకంతా నీవే. విశ్వ అంటే జీవుడని చెప్పినా సరిపోతుంది. జీవులమైన మా జీవిత మంతా నీవే. అలాగే ఈ కనిపించే సర్వ ప్రపంచమూ దాని స్థితి గతులూ నీవే. అభిభూః - దేనినైనా త్రోసి పుచ్చే సామర్థ్యమూ నీవే. ఓ గాయత్రీ.
ఓం గాయత్రీ మావాహయామి - కనుక ఓ గాయత్రీ నిన్నే ఆవాహన చేస్తున్నాను. ఆవాహన మంటే సాధకుడు తన మీదికి తెచ్చుకోటం. అప్పుడా శక్తి ప్రభావం మనకు సంక్రమిస్తుంది. సావిత్రీ మావాహయామి - సరస్వతీ మావాహయామి. గాయత్రినే గాక సావిత్రీ సరస్వతులను కూడా ఆహ్వానిస్తున్నాను. దీనివల్ల సృష్టి స్థితి లయాలు లేదా జాగ్రత్స్వప్న సుషుప్తులు మూడు కాలాల్లో దాని ప్రభావం మాకు సంక్రమించాలని భావన. ఛందర్షీ నావాహయామి - ఈ గాయత్రీ ఛందస్సును దర్శించిన విశ్వామిత్రాదుల ప్రభావం కూడా మామీద పనిచేయాలి. శ్రియ మావాహయామి. అదంతా మాపాలిటికి సంపదే. ఐశ్వర్యమే.
గాయత్ర్యా గాయత్రీ ఛందః - ఈ గాయత్రికి ఛందస్సు గాయత్రే. అంటే గాయత్రీ శక్తిని అభివ్యక్తం చేసేది గాయత్రీ శ్లోకం. విశ్వామిత్ర ఋషిః - విశ్వామిత్రుడే మొదట దీన్ని దర్శించిన ఋషి. సవితా దేవతా. ఈ ఛందస్సు కధి దేవత - సవిత. సూర్య భగవానుడు. అంటే సూర్య మండలం ద్వారా వ్యక్తమైన పరమాత్మ.
Page 73