#


Back

   ఏమి చేస్తూ వెళ్లుతున్నాడు. సత్యానృతే అవ పశ్యన్ జనానాం. మానవులు వారు వారు చేసే మంచి చెడ్డలను గమనిస్తూ. మనమిచ్చే జలాన్ని ఆహారాన్ని ఉపయోగించుకొని ఈ ప్రాణులు సత్కర్మలాచరిస్తున్నారా లేక దుష్కర్మలు చేస్తున్నారా అని సమీక్షణమిది. మధుశ్చ్యుత శ్శుచయః పావకాః మధురమైన పదార్ధాలన్నిటినీ మనకు ప్రసాదించేది జలమేనని భావం.

   అంతేకాదు. యా సాందేవా దివి కృణ్వంతి భక్షం. దేవతలందరూ కూడా ఈ జలాలనే భక్ష్య పదార్ధాలుగా చేసుకొని జీవిస్తున్నారు. ఎక్కడ దివి. ఆకాశంలో. కృణ్వంతి చేసుకొంటున్నారు. దేవత లమృతం తాగి బ్రతుకుతారనే మాటకిదే అర్థం. అమృత మేదో గాదు జలమే. అది భూమిని స్పృశించనంత వరకూ అమృతం. భూమి మీద పడితే మృతం. త్రిపాద స్యామృత మని పురుష సూక్తం చెప్పిందంటే ఇదే భావం. అలాటి అమృతాన్ని దేవతలు సేవిస్తున్నారంటే అర్థం ఆధి దైవికమైన శక్తులతి సూక్ష్మమైన ఆ పాంచ భౌతికమైన తత్త్వాలనే ఆశ్రయించి నిలిచి ఉన్నాయని. శక్తి ఎప్పుడూ భూతాన్ని ఆశ్రయిస్తుంది. లేకుంటే వ్యక్తమయి కనపడదు. భూతమెప్పుడూ శక్తి నాశ్రయిస్తుంది. లేకుంటే దాని కస్తిత్వమే లేదు. కాబట్టి దానికిది భక్ష్యం. దీనికది భక్ష్యం. అంటే ఆధార మాశ్రయమని భావం. యా అంతరిక్షే బహుధా భవంతి. అంతరిక్షంలో ఏవి నానారూపాలు ధరిస్తున్నాయో. ద్యులోకంలో అసలు కనపడవవి.

Page 60