#


Index

   అది కూడా నిశ్శేషమయి పోవాలట. ఎలాగా. ఇద మహం - ఇదుగో నేను మాం నన్ను. జుహోమి హోమం చేస్తాను. ఆహుతి చేస్తాను. నేను నన్ను ఆహుతి చేయట మేమిటి. చైతన్య రూపుడవైన నేను కర్తృరూపమైన నా అహంకారాన్ని అని అర్థం. అహంకారమే కర్త. ఆత్మ కాదు. కర్త గనుకనే అన్ని పాపాలూ అహంకారమే చేయిస్తున్నది. అంచేత దాన్ని ఆహుతి చేస్తే చాలు. తన్నిమిత్తంగా ఏర్పడే వన్నీ ఆహుతి అయిపోతాయి. ఎలా పోతుందది. జుహోమి అగ్నిలో హోమం చేస్తే పోతుంది. ఏమిటా అగ్ని హోత్రం. ఎలా చేయాలి హోమం. అమృత యోనౌ సూర్యే జ్యోతిషి. సూర్యుడనే జ్యోతిలో తేజస్సులో చేయాలి. అదే హోమకుండం. ఎలాంటి దది. అమృత యోనౌ. అమృతం నుంచి ఉద్భవించింది. మృతం కానిది అమృతం. ఎప్పటికీ నిలిచి ఉండేది. ఏదది. భగవన్మాయా శక్తి. ఇంతకు ముందే వివరించా మీ విషయం అమృతం బ్రహ్మణి అనేచోట. అవ్యక్తమహ దహంకారాలని వరస. అవ్యక్తమన్నా అమృత మన్నా మాయా శక్తే. అది సమష్టి రూపమైన మహత్తుగా వ్యష్టి రూపమైన అహంకారంగా మారింది. ఈ అహమే అన్ని దుష్కృత్యాలకూ మూలం కాబట్టి లయ క్రమంలో దీన్ని మహత్తు లోనూ దాన్ని మరలా అవ్యక్తమైన శక్తిలోనూ లయం చేసుకొంటూ పోవాలి. అంటే అలా భావిస్తూ పోవాలి. అప్పుడా పాపం క్షాళితమై దాని ఫలితం మనల నంటదు. స్వాహా. సు ఆహా బాగా ఆహుతై పోవాలని అర్థం.

Page 51