#


Index

సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చమన్యు కృతేభ్యః పాపేభ్యో రక్షంతామ్- యద్రాత్రి యా పాప మకార్షమ్ - మనసా వాచా హస్తాభ్యామ్ - పద్భ్యా - ముదరేణ - శిశ్నా- రాత్రి స్తదవలుంపతు యత్కించ దురితం మయి - ఇద మహం మా మమృత యోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా

  సూర్యశ్చ మన్యుశ్చ మన్యుపతీయశ్చ- ముగ్గురు. ఇందులో సూర్యుడు ప్రత్యక్ష దైవతం. మనం చేసే కర్మలన్నిటికీ సాక్షి - జగత్తు కంతా చక్షుస్సు. కనిపెట్టి చూచే నేత్రం. పరమాత్మ తేజో రూపంగా అక్కడ అవతరించాడు. పోతే మన్యుశ్చ. మన్యువంటే కోపమని మన్యుపతి అంటే కోపానికధి దేవత అని అర్థం చెప్పవచ్చు. అది బాహ్యార్థం. అంతరార్థ మేమంటే మన్యు శబ్దానికి మంత్రమని కూడా అర్థముంది. మూడర్ధాలున్నాయి మన్యువనే మాటకు. మూడేమిటి. నాలుగున్నాయి ఆ మాటకు వస్తే. మన్యు అంటే కోపమని యజ్ఞమని మంత్రమని ఆలోచన అని కూడా అర్థాలే. శతమన్యు అంటే ఏమిటి. నూఱు యజ్ఞాలు చేశాడు కాబట్టి ఇంద్రుడికి శతమన్యు అని పేరు వచ్చింది. అభిమన్యు అంటే అభిమానించే వాడు - శరీరమే నేనని భావించేవాడు. భావన అని అర్థమక్కడ.

   మన్యు అంటే ఇక్కడ మంత్రమని అర్థం. మను అంటే కూడా మంత్రమే. అప్పటికి మన్యు అంటే ఇక్కడ గాయత్రీ మంత్రం.

Page 48