#


Index

   మీకు ప్రీతి పాత్రమైన స్థానం కూడా అదే గదా. మేమేమిటి. మీరు కూడా మొదట అక్కడి నుంచే గదా వచ్చారు. కనుక మీకూ మాకూ అదే గమ్యం గనుక త్వరగా చేర్చండి మీరా గమ్యాన్ని మమ్ము. ఆపో జనయధా చనః మాకు దాన్ని ప్రసాదించండి ఓ జల దేవతలారా.

   ఇలాటి గొప్ప భావంతో ప్రోక్షణ చేసుకోవాలి జలం. అంతేగాని ఏదో యాంత్రికంగా చేస్తూ పోవటం కాదు. మనోభావనే ప్రధానం దేనికైనా. బాహ్యమైన క్రియ కాదు. క్రియ దాని కనుగుణంగా సాగితేనే ఫలితమిస్తుంది. యదేవ విద్యయా కరోతి తద్వీర్యవత్తరం భవతి అని గదా శాస్త్రం చాటుతున్నది. పోతే ఇలాంటి సంకల్పం పెట్టుకొని ఇక వందనం చేస్తున్నాడు సాధకుడు. అలా చేసే ముందు పవిత్రతను భావించాలి. ఒక గొప్ప భావం మనలోనికి ఆవాహన కావాలంటే మన పాత్ర బాగా శుద్ధమయి ఉండాలి. పాత్ర అంటే శరీరమే కాదు. వాక్కు కాదు. అసలైన పాత్ర మనస్సు. అది శుద్ధి చెందితే దానితో పాటు అన్నీ చెందినట్టే. ఈ శుద్ధి మూడు సంధ్యలలోనూ సాగుతూ పోతుంది. అందులో ప్రాత స్సంధ్యలో చెప్పుకొనే మంత్రమిది.

Page 47