#


Index

   దానిలో సంవత్సరం అయనం ఋతువు మాసం పక్షం తిథి వారం అహస్సు ముహూర్తం నక్షత్ర యోగ కరణాలతో సహా పరిగణిస్తే కాలమక్కడికి ఆఖరు. ఇదంతా చెప్పుకొంటూ పోతే అది కాల సంకీర్తనం క్రిందికి వస్తుంది.

   దేశ కాలాలు రెండూ అయిన తరువాత ఇక పాత్ర. వాటి లాగే ఇది కూడా శుద్ధి కావలసి ఉంది. పాత్ర అంటే ఏదో కాదు. మనమే. మనమే శుద్ధి అయితే పాత్రుల మవుతాము ఏ అనుష్ఠానానికైనా. అంటే యోగ్యత సంపాదిస్తామన్న మాట. ఏమిటది ఎలాగో చెబుతున్నారు. శ్రీమతః - శ్రీ అంటే ఐశ్వర్యం పారమేశ్వరమైన ఏ ఐశ్వర్యముందో అదే నాలో ఉందని భావించాలి. భారద్వాజ సగోత్రస్య - భరద్వాజాది మహర్షుల గోత్రంలో గదా జన్మించాము. మన పూర్వికులైన ఆ మహర్షుల నామం స్మరిస్తే వారి తపః ప్రభావం మనమీద పనిచేస్తుందని భావన. శ్రీనివాస శర్మాభిధానస్య ఫలానా పేరు గలవాడనని ధర్మపత్నీ సమేతస్య - నా ధర్మమే నా పత్ని కూడా పాటించాలి కాబట్టి నేను ధర్మ మార్గం తప్ప గూడదని భావన. తప్పితే ధర్మకార్యాని కర్హత లేదు. పోతే ఇంత చెప్పుకొన్న నాలో వ్యక్తిగతంగా కల్మషముంటే సరిపోదు. ఎన్నో పాపకార్యాలు చేసి ఉండవచ్చు నేను. తన్నిమిత్తంగా ఎంతో మాలిన్యం పేరుకొని ఉండవచ్చు. అది ప్రక్షాళితం కానంత వరకూ ప్రయోజనం లేదు. చేసే ధర్మకార్యం ఫలితమివ్వదు.

Page 41