అలా చెదురు మదురుగా పోయేవన్నీ ఒకచోట సమకూర్చుకొంటే దానికి సంకల్పమని పేరు. అలా చెప్పుకోటంలో దేశకాల పాత్రలు మూడూ ఒకే ఒక గమ్యాని కభిముఖంగా ప్రసరించాలని తాత్పర్యం. ఏమిటా సంకల్పమంటే చెబుతున్నారు.
పంచా శత్కోటి విస్తీర్ణ మహీ మండలే - లక్షయోజన విస్తీర్ణ జంబూ ద్వీపే - భరత వర్షే - భరత ఖండే - మేరో ర్దక్షిణ - దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే - కృష్ణా గోదా వర్యోర్మద్యదేశే స్వగృహే - సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ
ఇంతవరకూ ఇది దేశ సంకీర్తనం. దీని ద్వారా తాను కూచున్న ప్రదేశాన్ని పరిశుద్ధంగా భావిస్తున్నాడు సాధకుడు. యాభయి కోట్ల యోజనాల విస్తార ముందట ఈ భూమండలమంతా. ఇందులో లక్ష యోజనాలున్నదీ జంబూ ద్వీపం. సప్త ద్వీపాలలో ఇది ఒకటి. ఇప్పటి ఆసియా ఖండమిదే. ఇందులో కిం పురుషాది వర్షాలలో ఒకటి భరత వర్షం. అందులోనూ భరత ఖండం. మేరు పర్వతానికి దక్షిణంగా ఉందిది. శ్రీశైలాని కాగ్నేయం. పోతే కృష్ణా గోదావరీ నదుల మధ్యలో ఉంది మన నగరం. అందులో మన గృహం. ఇక్కడ మనముంటున్నాము. మనమంటే కేవలం మన బంధు మిత్రాదులే గాదు. సమస్త దేవతలూ వారిని నిత్యమూ సేవించే బ్రహ్మ జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులూ - వీరి కధీశ్వరులైన హరిహరాది దేవాది దేవులూ అందరూ సన్నిధి చేసి ఉన్నారు.
Page 37