#


Index

   ఇంతకూ బ్రహ్మమెలా అమృతమో బ్రహ్మాకార వృత్తి కూడా అమృతమే. వేద్యమూ అమృతమే. విద్యా అమృతమే. ఎప్పటికీ మార్పు లేదు దానికి. కూటస్థం.

   పోతే ఇలాంటి కూటస్థమైన బ్రహ్మ తత్త్వాన్ని అందుకోవాలంటే సామాన్యం కాదు. దానికెంతో చిత్తశుద్ధి ఉండాలి. చిత్తమే గదా సాధన మటు ధర్మానికి గానీ ఇటు మోక్షానికి గానీ. అందుకే మన ఏవ మనుష్యాణా మనే మాట వచ్చింది. బ్రహ్మం శుద్ధమైనప్పుడు దాని నందుకొనే మనస్సూ శుద్ధి కావలసిందే గదా. పోతే చిత్తశుద్ధి సత్త్వ శుద్ధిని బట్టి ఏర్పడుతుంది. అంటే రజస్తమో గుణాలను దూరం చేసుకోవాలది. తమస్సు ఆవరణానికీ రజస్సు విక్షేపానికీ దారి తీస్తాయి. అప్పుడు సాధకుడికి నిర్మలత్వమూ ఏకాగ్రతా దెబ్బతింటాయి. అది గమ్యం చేరటానికి ప్రతిబంధకం. కనుక మనసు శుద్ధమూ ఏకాగ్రమూ కావాలంటే దానికి దేశకాల పాత్రలు పరిశుద్ధంగా మారిపోవాలి. మనమెప్పుడే పనిచేసినా ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో ఉండి ఆ పని చేస్తుంటాము. ఎక్కడో ఒకచోట అంటే అది దేశం. ఎప్పుడో ఒకప్పుడంటే కాలం. ఏదో ఒక రూపమంటే పాత్ర. దేశకాల పాత్రలనేవి నియామకాలు ప్రతి పనికీ. అవి ఎప్పుడే గాని పరిశుద్ధంగా ఉండాలా దేశకాల పాత్రలనేవి. అందుకే ముందు సంకల్పం చెప్పుకొంటాము మనం. వికల్పం లేకపోవటమే సంకల్పం. వికల్పమంటే మనసు చెదిరి పోవటం.

Page 36