#


Index

   ఏమిటి నామరూప క్రియాత్మకంగా పరచుకొని కనిపించే ఈ చరా చర పదార్ధాలన్నింటినీ. దేవస్య అలా ప్రసవించే దివ్యమైన శక్తి ఉంది దానికి సహజంగానే. అదే ధియోనః మన బుద్ధులలో ప్రవేశించి వీటిని కూడా ప్రచోదయాత్. ముందుకు నడుపుతున్నది. అయితే సదసచ్చాహ మర్జున అని ఆయనగారే చెప్పినట్టు అవి మంచి ఆలోచనలైనా కావచ్చు. చెడ్డవైనా కావచ్చు. వివేచన లేకపోతే అసద్భావాలే చోటు చేసుకొంటాయి. ప్రాపంచికమైన వృత్తులన్నీ అలాంటివే. విక్షేపానికే దారి తీసి సంసారాభి ముఖంగా నడుపుతాయవి. అలా కాక పారమార్ధికంగా పయనించాలంటే పరమాత్మ సంబంధి అయిన ఆలోచనే పెట్టుకోవాలి మనం. అదే వరణ్యం భర్గః కోరదగినది. దానికే బ్రహ్మాకార వృత్తి అని పేరు. జీవ జగదీశ్వర భేదం చూడక మూడూ కలిసి కేవలం సచ్చిద్రూపమైన ఆత్మ తత్త్వమేనని చూచే చూపది. అసతో మా సద్గమయ అన్నట్టు అదే ఈ ప్రాపంచిక భావాలన్నింటినీ త్రోసి పుచ్చి పరమాత్మ వైపు ప్రచోదయాత్ నడుపుతూ పోతుంది మానవుడి బుద్ధిని. జీవిత గమ్యమైన కైవల్యమేదో అది చివరకు అందజేస్తుంది. సందేహం లేదు. ఇది ఆది దైవికంగా ఈ మంత్రానికి మనం చెప్పుకోవలసిన అంతరార్థం. ఇదే అసలైన మంత్రార్థమని నిర్ణయించటాని కెంతో దూరం పోనక్కర లేదు. పరమాత్మా స్వరూపం సాయుజ్యే వినియోగః అని గాయత్రి అంటే ఏమిటో దాని ప్రయోజన మేమిటో వాచ్యం గానే చెప్పాడు మహర్షి.

Page 31