#


Index

   అంటే ఆలోచించింది. సంకల్పించిందని అర్థం. పరమాత్మ నుంచి ఒక ఇచ్ఛా శక్తి బయలు దేరిందదే ఆయన తపస్సు. అప్పటికి కూటస్థమైన తత్త్వ మొక మెట్టు క్రిందికి దిగింది. అంటే ఆయన మహాశక్తి అవరోహణ చెందుతున్నది. అది జనః అఖండమైన జ్ఞానంలోనే జన్మించిందది. అదే ఆకాశం. ఈ ఆకాశంలోనే మరొకటి విశాలంగా వ్యాపించిందది మహః వాయుమండలం. దానినుంచి సువః తేజస్తత్త్వం తయారయింది. అందులో నుంచి వచ్చింది భువః జలతత్త్వం. దానివల్ల ఆవిర్భవించింది భూః పృధివీ తత్త్వం. ఇదీ సృష్టి క్రమం - అవరోహణాత్మకంగా సాగుతూ వచ్చింది.

   అయితే మనమీ సృష్టి క్రమం పట్టుకొంటే సుఖం లేదు. ఇది సంసారంలో పడదోస్తుంది. కనుక ఇందులో నుంచి బయటపడాలంటే దీన్ని మనం లయక్రమంలో భావన చేయాలి. అంటే ఆరోహణ మార్గంలో వెళ్లిపోవాలి. అందుకే మంత్ర మారోహణాత్మకంగా నడుస్తుంటుంది. ఓం భూః ఓం భువః ఓం సువః అని గదా ఉచ్చరిస్తుంటాము. ఇది ఆరోహణ మార్గం. అంటే అమ్మవారు మనల నంత కంతకు పై అంతస్తుకు తీసుకువెళ్లుతున్నట్టు భావన. ఆ శక్తి క్రిందికి దిగి వచ్చి గదా మనలను పైకి కొనిపోవలసింది. క్రిందికి దిగి వచ్చి భూః పృధివీ తత్త్వంగా మారిపోయింది. ఇదే ఆవిడ వైఖరీ రూపం. వైఖరి అంటే అది భౌతికమైన స్థాయి. అదే ఇప్పుడు మనకు కనిపించే ఈ సూర్యమండలం.

Page 27