ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే
భూత పిశాచాః అంటే పంచభూతాలే మనపాలిటికి పిశాచాలు. ఇవి మనదారి కడ్డు తగులు తున్నాయి. భూత భౌతిక పదార్ధాలే గదా నామ రూపక్రియలన్నీ. వీటి ఆలోచనలే గదా నిత్యమూ మన మనస్సులో చేరిపోయి సంసారంలో పడదోశాయి మనలను. ఇవన్నీ ఉత్తిష్ఠంతు. నామోచ్చారణతో ఉచ్చాట నమయి పోవాలి. ఎందుకని. భూమి భారకాః ఇవన్నీ భూమికి భారం. భూమికి భారమైనా కాకున్నా మానవుడి మనో భూమికి భారం కాగూడదు. మన మనస్సనే క్షేత్రంలో చేరిపోయా యివన్నీ. కనుక వీటితో బరువెక్కి పోయింది మనస్సు. అదే బంధం. అది ముక్త మవ్వాలిప్పుడు. తేలిక పడాలి. నామోచ్చారణతో వాటి బరువు తొలగిపోతే తేలిక పడుతుంది. పడితే ఏతేషా మవిరోధేన ఇక వాటితో పేచీ లేదు మనకు. పరమాత్మ భావనలోనే లీనమయి పోతాయవి కూడా. కనుక బ్రహ్మ కర్మ సమారభే. బ్రహ్మ కర్మను మనమిక నిరాఘాటంగా సాగించవచ్చు.
బ్రహ్మ కర్మ అంటే బ్రహ్మ ప్రాప్తి కోసం చేసే కర్మ. స్వర్గ ప్రాప్తి కోసం చేసేది కాదు. అది మరలా సంసారంలో పడదోసేదే. బ్రహ్మ సాయుజ్యానికి పనికిరాదు. బ్రహ్మ సాయుజ్యమే జీవిత సమస్యకు పరిష్కారం. అంచేత బ్రాహ్మణుడనైన నేను బ్రహ్మతత్త్వాన్ని చేర్చే కర్మనే చేస్తూ పోవాలెప్పుడూ. అది దృష్టిలో పెట్టుకొని చేస్తున్నా నీ సంధ్యా వందన కర్మ కూడా ఇప్పుడని సంకల్పించి చేయాలి. ఎలాగ.
Page 23