పరమాత్మ నామాలు గదా ఇవి. వీటిని జపిస్తూ పోతే ప్రాపంచికమైన భావాలను దూరంగా పారదోలుతాయి. ఇందులో ఉన్న ఆంతర్య మేమంటే నామమంటే పరమాత్మకు సంబంధించిన చిత్తవృత్తి Idea. ఆలోచనే నామం. బాహ్యంగా మనకు కేశవాది నామాలుగా Word కనపడుతున్నాయవి. అందులో ఒక్కొక్క నామం మన ముచ్చరిస్తుంటే పరమాత్మ తాలూకు ఒక్కొక్క ఆలోచనను కలిగిస్తుంటుందది. నామం శబ్దమైతే ఆ ఆలోచన అర్థం. ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నప్పుడా ఆలోచన మన మనసుకు రావాలి. అంటే పరమాత్మ ఆ రూపంగా మనసులో ప్రవేశించాలన్న మాట.
అదే ఆచమనం. ఆచమన మంటే నీరు లోపలికి తీసుకోటం. ఈ నీరు పరమాత్మ కొక ఉపాధి Medium. దీని ద్వారా పరమాత్మే మన లోపలికి వస్తున్నదని భావన చేయాలి మనం. ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా ఇవి విష్ణు నామాలే అనుకో నక్కర లేదు. ముందు చెప్పినట్టు శివకేశవులకు భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ అని చివరలో అదే చెప్పబోతాడు మహర్షి. అయితే వీటి కర్థమేమిటి. క అఈశ - అనే మూడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికీ సంకేతాలు. అదే కేశవ అయింది. అలాగే నారములంటే పంచభూతాలు.
Page 20