#


Index

   అవి ఈ స్మరణను నిరాఘటంగా సాగనివ్వవు. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నారు పెద్దలు. ఎప్పటికప్పుడివి మన మార్గాని కడ్డు తగులుతుంటాయి. ఏమిటా శక్తులెన్ని అని అడిగితే ఇరవయి నాలుగని పరిగణించారు పెద్దలు. వాటినే చతుర్వింశతి తత్త్వా లంటారు. భగవద్గీతే చాటి చెబుతున్న దొక పక్క. మహాభూతాన్య హంకారో బుద్ధి రవ్యక్త మేవచ. ఇంద్రియాణి దశైకంచ పంచ చేంద్రియ గోచరాః అన్నీ కలుపుకొని చూస్తే ఇరవయి నాలుగవుతాయి. ఏకంచ అనటంలో ఆ ఏకమేదో గాదు మనస్సు. అప్పటి కెక్కడి నుంచి ఎక్కడికీ పరిగణన. బాహ్యమైన ఆకాశం దగ్గరి నుంచి ఆంతరమైన హృదయాకాశం వరకూ. Matter and Mind అనేవి ఇవే.

   ఇప్పుడీ చతుర్వింశతి తత్త్వాలలో మొత్తం సృష్టి అంతా కలిసి వచ్చింది. అండ పిండ బ్రహ్మాండాత్మకమైన దీన్నే మనం ప్రపంచమని పేరు పెట్టి పిలుస్తున్నాము. ఈ ప్రాపంచికమైన ఆలోచన లేవైతే ఉన్నాయో అవే మన పాలిటికి అసుర సంపద. ఇలాటి అసుర భావాలన్నీ వచ్చి మనసులో చేరి తాండవం చేస్తుంటే పరమాత్మ తాలూకు స్మరణ కిక అవకాశ మేముంటుంది. నిత్యమూ పరమాత్మ భావనతో సత్కర్మ లాచరించాలంటే మనం వీటి ధాటికి తట్టుకొని నిలవ గలగాలి గదా. ఎలాగా అని ప్రశ్న.

   దీనికి సమాధానమే కేశవ నామాలు. ఇరవయి నాలుగు నామాలివి. ఇవి ఇరవయి నాలుగూ ఆ ఇరవయి నాలుగు అసుర భావాలకూ జవాబు చెబుతాయి.

Page 19